
పుట్టినరోజునాడే మరణం
ప్రజాశక్తి - నరసాపురం టౌన్
మున్సిపల్ ఉద్యోగి యర్రప్రగడ భాస్కర్ (54) శనివారం ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. శనివారం ఆయన పుట్టినరోజు కూడా. ఆయన ఆకస్మిక మృతిని కుటుంబసభ్యులతో పాటు తోటి ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తండ్రి మున్సిపల్ ఉద్యోగిగా పని చేశారు. తండ్రి బాటలో నడిచిన భాస్కర్ పురపాలక సంఘానికి విశిష్ట సేవలందించారు. ముఖ్యంగా మున్సిపల్ సమావేశాల్లో ఎజెండా చదివే తీరు ఆయనకే చెల్లింది. భాస్కర్‌కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు ఆయన మృతదేహాన్ని సందర్శించి పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీవెంకటరమణ, వైస్ చైర్‌పర్సన్ కామన నాగిని, కమిషనర్ వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ నానాజీ, గోటేటి అరుణ, కౌన్సిలర్ జయరాజు, శరత్, మున్సిపల్ ఉద్యోగులు భాస్కర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.