ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: సారవకోట మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి.విశ్వేశ్వరరావు (54) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. వృత్తిరీత్యా సారవకోటలో పనిచేస్తున్న ఆయన విజయనగరం జిల్లా రాజాంలో స్థిర నివాసం ఉంటున్నారు. మూడు రోజుల కిందట విధుల్లో ఉండగా గుండె నొప్పి రావడంతో జెమ్స్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స అవసరమని చెప్పడంతో, అక్కడే ఉంచి చికిత్స అందించారు. ఆదివారం శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా, ఉదయం మరోసారి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. విశ్వేశ్వరరావు మృతిపై జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వ్యక్తిగతంగా అందరి అభిమానాన్ని పొందడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వర్తించే వారని గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.










