Jan 26,2023 23:02

ప్రజాశక్తి-హెల్త్‌యూనివర్శిటీ: ఆంధ్ర హాస్పటల్స్‌ - హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ యుకె సౌజన్యంతో చిన్న పిల్లలకు గుండె సర్జరీల ఉచిత క్యాంపు విజయవంతంగా నిర్వహించినట్లు హాస్పటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.వి.రామారావు అన్నారు. నగరంలోని హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఇనిస్టిట్యూట్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అప్పటి వరకు అత్యధికంగా పిల్లల కార్డియాక్‌ సర్జరీలు నెలకు 50 ఆపరేషన్లు చొప్పున సంవత్సరానికి 600 గుండె ఆపరేషన్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 3 వేల ఆపరేషన్లు , ఇంటర్వెన్షన్స్‌ విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 23 నుండి జరిగిన ఉచిత పిల్లల గుండె సర్జరీల క్యాంపులో 20 ఆపరేషన్లు నిర్వహించామన్నారు. గత ఏడు సంవత్సరాల నుండి ఇప్పటివరకు 25 సార్లు ఆంధ్ర హాస్పటల్స్‌కు వచ్చి పిల్లల గుండె సర్జరీలను యుకె వైద్యులు విజయవంతంగా చేశారన్నారు. ఈ క్యాంపుకు సహకారం అందించిన ఆరోగ్యశ్రీ, మహేష్‌ బాబు ఫౌండేషన్‌, వసుధ ఫౌండేషన్‌, ఆంధ్ర మదర్‌ అండ్‌ చైల్డ్‌ ఫౌండేషన్‌ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ శ్రీమన్నారాయణ, పిల్లల కార్డియాక్‌ ఇంటెన్సివిస్ట్‌ డాక్టర్‌ బాలకృష్ణ, కార్డియాక్‌ ఎనస్టిటిస్ట్‌ డాక్టర్‌ రమేష్‌ పాల్గొన్నారు.