సిపిఎం మండల కార్యదర్శి ఐవి
ప్రజాశక్తి -ఎటపాక
గుండాల ఇసుక ర్యాంపు అక్రమాలను అడ్డుకుంటామని సిపిఎం మండల కార్యదర్శి ఐవి అన్నారు. శనివారం సిపిఎం మండల కమిటీ సమావేశం గోల్లగట్ట గ్రామంలో బుద్దుల భద్రయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసా, 1/70 చట్టాలను తుంగలోతొక్కి అక్రమ పద్ధతుల్లో గుండాల ఇసుక ర్యాంపును నిర్వహిస్తున్న వారికి కలెక్టర్, ఐటీడీఏ పీవో స్థానిక అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారులు అక్రమ దారులకు సహకరిస్తూ గుండాల పంచాయతీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ ఇసుక ర్యాంపుకు ఎటువంటి అనుమతులు లేవని, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర వే బిల్లులు చూపిస్తూ తెలంగాణకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులను అరికట్టడంలో అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఇసుక ర్యాంపు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు డి.మాధవరావు, ఏ.రాము, కాక అర్జున్, సవలం రాము, నక్క సూరిబాబు పాల్గొన్నారు.










