Dec 30,2022 23:58

గుండాల ఇసుక ర్యాంపు వద్ద ఆందోళన చేస్తున్న సిపిఎం, టిడిపి, జనసేన శ్రేణులు

ప్రజాశక్తి -ఎటపాక
మండలంలోని గుండాల ఇసుక ర్యాంపు 1/70, పీసా చట్టాలకు విరుద్ధంగా నడుస్తుందని, దానిని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ సీపీఎం, టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం ఇసుక ర్యాంపు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ చత్తీస్‌ఘడ్‌ వేబిల్స్‌తో అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి ఇసుకను తరలిస్తున్నారని తెలిపారు. గిరిజన చట్టాలను కాలరాస్తూ, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగిస్తూ ఇష్టానుసారంగా నదిగర్భంలో ఎక్కువ లోతు తవ్వుతున్నారని విమర్శించారు. గిరిజన సొసైటీ ఏర్పాటు చేయాలన్న పీసా చట్ట నిబంధనలను ఉల్లంఘించారన్నారు. మ్యాన్‌ పవర్‌తో లోడింగ్‌ చేయాల్సి ఉండగా జెసిబిలతో లోడింగ్‌ చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలించకూడదని నిబంధనలు ఉన్నాయని, దీంతో చత్తీస్‌ఘడ్‌ వేబిల్స్‌తో తెలంగాణ రాష్ట్రానికి ఇసుక డంప్‌ చేస్తున్నారని తెలిపారు. నెల రోజులుగా ఈ ఇసుక ర్యాంపు నడుస్తున్నా అధికారులు కళ్ళకు గంతలు కట్టుకొని చోద్యం చూస్తున్నారని విమర్శించారు. తక్షణమే చింతూరు ఐటిడిఏ పీవో, జిల్లా కలెక్టర్‌ స్పందించి ఇక్కడ జరుగుతున్న ఇసుక దందాను నిలువరించాలని, అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఐవి, మాధవరావు, తెలుగుదేశం నాయకులు పుట్ట రమేష్‌, వల్లభనేని చందు, మాచినేని రాజేష్‌, జనసేన నాయకులు మారసు గంగాధర్‌, ఎంపీటీసీ పాయం దేవి, గుండాల గ్రామస్తులు పాల్గొన్నారు.