Dec 30,2022 00:03

గుండాల ఇసుక రీచ్‌లో ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులు, స్థానికులు

ప్రజాశక్తి-ఎటపాక
ఏజెన్సీ చట్టాలు తుంగలోకి తొక్కి, పీసా గ్రామసభ ఆమోదం లేకుండా జెపి సంస్థ నిర్వహిస్తున్న గుండాల ఇసుక క్వారీని తక్షణమే మూసివేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం ఇసుక క్వారీ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఐవి మాట్లాడుతూ కనకదుర్గ సొసైటీ వారికి లీజుకిస్తున్నట్టు గ్రామసభ తీర్మానం పొంది, జేపీ సంస్థ క్వారీ ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. తక్షణమే ఇసుక రీచ్‌ను మూసివేసి, నిబంధనలకు విరుద్ధంగా క్వారీ నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు, విజయవాడ వేబిళ్ళతో తెలంగాణలోని హైదరాబాద్‌కు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని విమర్శించారు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సి ఉండగా, జేపీ సంస్థ ప్రజల సంపాదనను కొల్లగొడుతుందన్నారు. జెసిబితో ఇసుక తవ్వకాలు చేసి లోడ్‌ చేస్తున్నారని తెలిపారు. ఇన్ని ఉల్లంఘల్లు చేస్తున్నా ప్రభుత్వం యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తక్షణమే ఉన్నతాధికారులు ఇసుక క్వారీపై దృష్టి పెట్టి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక క్వారీని మూసివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డేగల మాధవరావు కాక అర్జున్‌ పులుసు బాలకృష్ణ, సోయం వీరమ్మ, గద్దల హుస్సేన్‌, ఆకిశెట్టి రాము, నూతల పాటి సుధాకర్‌, బండారు స్టాలిన్‌, బండారు సూర్యకుమారి, తోట శ్రీను, తాటి అశోక్‌ పాల్గొన్నారు.