సిపిఎం మండల కార్యదర్శి ఐవి
ప్రజాశక్తి-ఎటపాక
మండలంలోని గుండాల గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపు నిర్వాహకులు, ఇప్పుడు జనావాసాల పక్కనే డంపింగ్ యార్డ్ పెట్టి మరో అక్రమ పనికి పూనుకున్నారని సిపిఎం మండల కార్యదర్శి ఐవి అన్నారు. శుక్రవారం ఆయన స్థానికులతో కలిసి గుండాల ఇసుక డంపింగ్ యార్డును పరిశీలించారు. ఈ సమయంలో అక్కడకు ఇసుక డంప్ చెయ్యడానికి లోడ్‌తో వచ్చిన లారీని అడ్డగించి వెనక్కు పంపించారు. ఈ సందర్భంగా ఆjటున మాట్లాడుతూ గోదావరి నదిలోని ఇసుకను తోడి గుండాల గ్రామంలోని ఇళ్ల పక్కనే డంప్ చేస్తున్నారని, ఇక్కడికి లారీలు, ట్రాక్టరులు రాకపోకలు సాగించడంతో దుమ్ము, ధూళి నివాసాలపై పడుతుందని తెలిపారు. దీని వల్ల ఈ డంపింగ్ యార్డుకు పక్కనే ఉన్న కుటుంబాల వారికి శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ నుండి ఇసుక డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. స్థానికులు గట్టిగా నిలబడితే సిపిఎం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకిశెట్టి రాము, జి.హుస్సేన్, నూతలపాటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.










