Nov 10,2022 23:37

గిరిజనులతో మాట్లాడుతున్న డాక్టర్‌ హిమబిందు

ప్రజాశక్తి -సీలేరు : జికేవీధి మండలం దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుమ్మిరేవుల్లో గురువారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. పిహెచ్‌సి వైద్యాధికారిణి డాక్టర్‌ హిమబిందు పాల్గొని 150 మంది గర్భిణులు, చిన్నారులు, ఇతర రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గిరిజనులతో మమేకమై వారి ఆరోగ్యం, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలకు తగు సూచనలు చేశారు. గర్భిణులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య సేవలు పొందాలని కోరారు. జ్వరం వస్తే ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించారు. పసరు, నాటు వైద్యాలను ఆశ్రయించి, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 104 వైద్యాధికారి డాక్టర్‌ రుక్మిణి, ఎంపిహెచ్‌ఇఒ పోతురాజు, హెచ్‌ఎస్‌ గంగరాజు పాల్గొన్నారు.