Sep 08,2023 19:43

గ్రామంలో ఉన్న అక్రమ కట్టడాలు

ప్రజాశక్తి-హాలహర్వి
మండలంలోని గూళ్యం గ్రామంలో రహదారి గుండా అక్రమ కట్టడాలను అరికట్టాలని ఎంఆర్‌పిఎస్‌ మండల కన్వీనర్‌ ఎల్లప్ప డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గూళ్యంలోని శ్రీగాదిలింగేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ప్రతేడాది శివరాత్రి తర్వాత పంచమి నాడు జోడు రథోత్సవం వైభవంగా జరుగుతుందని చెప్పారు. ఈ రథోత్సవాన్ని తిలకించడానికి లక్షల్లో భక్తులు తరలివస్తారని తెలిపారు. అలాంటి దేవాలయం ముందు ప్రధాన రహదారిలో అక్రమంగా ఇల్లు కట్టుకొని రేకుల షెడ్డు వేశారని చెప్పారు. గ్రామంలో రాజకీయాలకు అతీతంగా అక్రమ కట్టడాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోక పోతే శ్రీగాదిలింగేశ్వర స్వామి రథం లాగేందుకు ఇబ్బందులకు గురవుతారన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. దళిత సంఘం నాయకులు గోవిందు, గాదిలింగప్ప, విజరు, నవీన్‌ పాల్గొన్నారు.