ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి: విద్యుత్ ఛార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచడంపై వామపక్షాలు మరో ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నాయి. పెరిగిన విద్యుత్ బిల్లుల భారాలు, స్మార్టు మీటర్లు, ట్రూఅప్ ఛార్జీల వసూలును నిరసిస్తూ శుక్రవారం పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని విద్యుత్ కార్యాలయాల వద్ద వామపక్ష పార్టీలు ధర్నాలు చేయనున్నాయి. సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, సిపిఐ (ఎంఎల్) రెడ్‌స్టార్, ఎంసిపిఐ (యు), ఐఎఫ్‌టియు తదితర పార్టీల ఆధ్వర్యంలో ధర్నా జరగనుంది.
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత నాలుగేళ్లలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలుపెరిగాయి. విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టాలు వస్తున్నాయనే సాకుతో ఏళ్ల తరబడి వివిధ రకాల ఛార్జీల వసూలు కొనసాగింపు వల్ల సాధారణ ప్రజలకు వినియోగించుకున్న యూనిట్లతో వచ్చే బిల్లు కంటే అదనపు ఛార్జీల భారం ఎక్కువగా ఉంటోంది. సగటున నెలకు రూ.200 నుంచి రూ.300 వరకు అదనపు భారం పడుతోంది. 100 నుంచి 150 యూనిట్లు వినియోగించే మధ్య తరగతి ప్రజలకు సాధారణ ఛార్జీల బిల్లు రూ.500 వరకు వస్తుండగా ఇతరఛార్జీలు రూ.300 వరకు భారం పడుతోంది. ట్రూ అప్ చార్జీలు ఏకంగా 36 నెలలపాటువసూలు చేయాలని నిర్ణయించారు. 2021 మేలో ఎఫ్‌పిపిసిఎ ఛార్జీలు, సాధారణ సర్‌ఛార్జి, కస్టమర్ ఛార్జీ, ఫిక్స్‌డ్ ఛార్జీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఇలా అదనపు భారం ప్రతి బిల్లుకు రూ.200పైనే ఉంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గృహ విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం విపరీతమైన భారం మోపుతోంది.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 17.50 లక్షల మందిపై వినియోగదారులు ఉండగా వీటిల్లో 16 లక్షల మంది పేద, మధ్య తరగతికి చెందిన వారే ఉన్నారు. జిల్లా వాసులపై ఏటా రూ.60 కోట్లకుపైగా అదనపు భారం పడుతోంది. సాధారణ వినియోగ ఛార్జీలతో పాటు ట్రూఅప్ ఛార్జీలు ప్రతి యూనిట్‌కు సగటున 1.50 పైసలు భారం పడనుంది. వీటిపై స్థిర ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, బిల్లు చెల్లింపులో ఆలస్యానికి అదనపు రుసుం కూడా పడనుంది. గతేడాది ఏప్రిల్ ఒకటి నుంచి ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రతి నెలా వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 11 నెలలు వసూలు చేశారు. ఇంకా 25 నెలలు వసూలు పర్వం కొనసాగనుంది. ట్రూఅప్ వల్ల ప్రతినెలా రూ.30 నుంచి రూ.100 వరకు అదనపు భారం పడుతోంది. 2014-2019లో డిస్కంలకు వచ్చిన నష్టాలకు సంబంధించి ఇప్పుడు వసూలు చేయడం ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఛార్జీల వసూలు పరంపర కొనసాగిస్తూనే తాజాగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిస్కంలకు వచ్చిననష్టాలకు కూడా గతనెల బిల్లు నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు. యూనిట్‌కు రూ.40 పైసలు అదనంగా వసూలు చేయనున్నారు. ఇలా ఏడాదిపాటు ఈభారం పడుతుంది. ట్రూఅప్, 2021 మే నెలలో వాడుకున్న విద్యుత్‌కు సర్ధుబాటు ఛార్జీ, 2023 ఏప్రిల్ నెలలో సర్ధుబాటు ఛార్జీల రూపంలో మొత్తంగా కనీసం రూ.200 నుంచి గరిష్టంగా రూ.300 వరకు అదనపు బిల్లులు వసూలు చేస్తున్నారు. వాస్తవంగా వినియోగించుకున్న యూనిట్లకు కన్నా ఇతరఛార్జీల భారం రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. రానున్న రెండేళ్లపాటు ట్రూ అప్ చార్జీల భారం కొనసాగనుంది. ఎగువ మధ్య తరగతి వారికి ఈ భారం ప్రతినెలా రూ.400 నుంచి రూ.500 ఉంటోందని వినియోగదారులు వాపోతున్నారు. చిన్న, మధ్య తరహ పరిశ్రమలకు రూ.వెయ్యిపైనే భారం పడుతోంది. ఇప్పటికే సంక్షోభంలోఉన్న పరిశ్రమలు అదనపు బాదుడుతో మరింత కుదేలవుతున్నారు. స్మార్టు మీటర్ల కొనుగోలుకయ్యే భారం నుంచి వినియోగదారుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.










