పులి పాదముద్ర
ప్రజాశక్తి- కొత్తూరు: మండలంలోని గులివిందలపేట పరిసరాల్లో పెద్దపులి పాదముద్రలు కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్తున్న గిరిజనులు గ్రామ పొలిమేరల్లోని పొలాల్లో పెద్దపులి పాదముద్రలను గమనించారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమయ్యారు. పులి పాదముద్రలు వాస్తవమేనని, మంగళవారం రాత్రి పెద్దమడి, సోలిపి, పడలి, దబ్బగూడ వైపు పులి వెళ్లినట్లు తెలుస్తోందని అటవీ సెక్షన్ అధికారి ఈశ్వరరావు తెలిపారు. దబ్బగూడ వద్ద రాత్రి 1.30 గంటల సమయంలో కుక్కలు ఎక్కువసేపు మొరిగాయని గ్రామస్తులు చెప్తున్నారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట బయట తిరగవద్దని సూచించారు.










