ఆదివారం రాత్రి కళింగపట్నానికి సమీపంలో తీరం దాటిన 'గులాబ్' తుపాను రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఒడిశాతో పోల్చితే ఆంధ్ర ప్రదేశ్‌కు ఎక్కువ నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా దాకా కుండపోతగా కురిసిన వర్షాలకు ఆర్గురు బలయ్యారు. అపార ఆస్తినష్టం సంభవించింది. 1.6 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు ప్రాథమిక అంచనా. తుపానుధాటికి ఉత్తరాంధ్రలో విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70-85 కి.మీ వేగంతో వీచిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, మొబైల్ సిగల్ టవర్లు పడిపోయాయి. చెట్లు కూలిపోయాయి. జలమయమైన పలు గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కరెంటు లేక, ఫోన్లు పనిచేయక, సురక్షితమైన మంచినీరు దొరక్క ప్రజలు పడిన అవస్థలు వర్ణనాతీతం. నాగావళి, వంశధార, వేదావతి నదులు పొంగుతుండడంతో వరదలు పొటెత్తే ప్రమాదముంది. గులాబ్ ధాటికి ఒడిశాను అనుకుని ఉన్న ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. శ్రీకాకుళంలో వజ్రపు కొత్తూరు, సంత బొమ్మాళి బాగా దెబ్బతిన్నాయి. కోవిడ్-19 మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలను ఇది కోలుకోలేని దెబ్బతీసింది. లక్షకు పైగా ఎకరాల్లో వరి, వేల ఎకరాల్లో మొక్కజొన్న నీట మునిగింది. వేరు శనగ, మిరప, ఉద్యాన పంటలకు కూడా నష్టం వాటిల్లింది. విద్యుత్ వ్యవస్థకు భారీగా నష్టం వాటిల్లింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు ఈ తుపాను దెబ్బకు మరింత అధ్వానంగా తయారయ్యాయి. పారిశుధ్యం, నీటి సరఫరా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. గులాబ్ విపత్తు సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోనే లేదు, మరో తుపాను పొంచి ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యధిక జనాభా, అంతంతమాత్రమే మౌలిక సదుపాయాలు కలిగిన మన దేశంలో చిన్న విపత్తు కూడా పెద్ద నష్టం కలిగించే అవకాశముంది. దీనికి తోడు తుపానుల స్వభావంలోనూ పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
భూగోళం వేడెక్కడం వల్ల వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ప్రభావం భయంకర తుపానుల రూపంలో వ్యక్తమవుతుందని వాతావరణ మార్పుల సదస్సు (ఐపిసిసి) చేసిన హెచ్చరిక సరైనదేనని తాజా తుపాను నిరూపించింది. 2020లో బెంగాల్‌ను కుదిపేసిన 'అంఫని' , అంతకుముందు గుజరాత్‌ను కకావికలం చేసిన 'తౌకే'్టలతో పోల్చితే గులాబ్ తీవ్రత తక్కువే కావచ్చు. కానీ, ఈ ఉష్ణ మండల తుపాను లక్షణాలు చాలా ప్రమాదకరమైనవి. తేమ, అధిక పీడనాశక్తి కలిగి వుండడం వల్ల ఇవి ఒక్కసారిగా కుంభవృష్టిని కురిపిస్తాయి. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో కురిసిన కుంభవృష్టి ఇందుకొక ఉదాహరణ. 2019లో ఎనిమిది ప్రమాదకర తుపానులు సంభవిస్తే 2020లో అయిదు ప్రమాదకర తుపానులు చోటుచేసుకున్నాయి. వీటి నుంచి పాఠాలు తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. విపత్తు సంభవించిన తరువాత అరకొర పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకుంటున్నాయి. ఇటువంటి విపత్తుల సమయంలో ఉదారంగా సాయం అందించాల్సిన కేంద్రం ఇది తన బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. గతంలో హుదూద్ తుపాను సందర్భంగా వెయ్యి కోట్ల సాయం ప్రకటించిన మోడీ ప్రభుత్వం ఆచరణలో రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గులాబ్ తుపాను గురించి ప్రధాని ఆరా తీశారే తప్ప బాధితులను ఆదుకునేందుకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడానికి వెంటనే సిద్ధపడే మోడీ ప్రభుత్వం ప్రజలను ఆదుకునే విషయంలో కనీస మానవత్వ స్పందననైనా కనపరచకపోవడం దుర్మార్గం. తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, శిబిరాల నుంచి ఇళ్లకువచ్చినవారికి వెయ్యి రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం ఏ మూలకూ చాలదు. తుపానులు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ఆర్థికంగా, సంస్థాగతంగా గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. అలాగే బీమా వ్యవస్థను పటిష్టపరచడం, పాలనాపరమైన సన్న ద్ధత పెంచుకోవడం, ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం గావించడం వంటివి చేపట్టాలి. తక్షణం గులాబ్ నష్టాలను సమగ్రంగా అంచనా వేసి బాధితులకు ప్రభుత్వం తగు పరిహారం చెల్లించాలి.










