
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : బాపట్ల జిల్లా చుండూరు నుంచి గుంటూరు మీదుగా గుజరాత్‌కు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్సు అధికారులు చేబ్రోలు వద్ద గురువారం స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌కు తీసుకువెళ్తున్న 700 బస్తాల బియ్యంను చేబ్రోలు విఘ్నేశ్వర సినిమా హాలు వద్ద అధికారులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్ థీరజ్‌ను విచారించగా చుండూరులోని పద్మశ్రీ రైస్ మిల్లులో 700 బస్తాల బియ్యం లోడ్ చేసుకున్నట్టు చెప్పాడు. రషన్ బియ్యం వ్యాపారి మేడికొండ రవికుమార్ ఈ సరుకు పంపుతున్నట్టు విజిలెన్సు అధికారులు తెలిపారు. బస్తాకు 50 కిలోల చొప్పున 350 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని రవికుమార్, థీరజ్‌లపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రైసు మిల్లు యజమాని, లారీ యజమానిపైనా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్సు అధికారులు శ్రీహరిరావు, చేబ్రోలు డిప్యూటీ తహశీల్దార్ భువనేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.