సొంత స్థలాల్లో ఇళ ్లనిర్మాణం కోసం జనం ఎదురుచూపులు
రెండు జిల్లాల్లో దాదాపు 13 వేల దరఖాస్తులు పెండింగ్
జిల్లా పరిషత్ సమావేశంలోనూ ప్రజాప్రతినిధులు గగ్గోలు
జగనన్న లేఅవుట్లలో ఇళ్లపైనే ప్రభుత్వం దృష్టి
తమ పరిస్థితి ఏమిటంటూ సొంత స్థలాల పేదలు నిర్వేదం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
స్థలం ఉండి, అందులో సొంతిల్లు నిర్మించుకోవాలని చూస్తున్న వేలాది పేద కుటుంబాల ఆశలు అడిశయాలుగానే మిగిలిపోతున్నాయి. ఇళ్ల నిర్మాణం కోసం జనం చేసుకున్న దరఖాస్తులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వైసిపి ప్రభుత్వం వచ్చాక రెండు జిల్లాల్లోనూ పెద్దఎత్తున ఇళ్ల స్థలాలిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం చేయాలని ప్రభుత్వం లబ్ధిదారులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తోంది. అత్యధిక లేఅవుట్లలో మెరక పనులు పూర్తికాకపోవడం, తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పన పూర్తికాకపోవడం, స్థలాలు ఊరికి దూరంగా ఉండటంతో ఇల్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అదే క్రమంలో సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలని చూస్తున్న పేద కుటుంబాలు రెండు జిల్లాల్లోనూ 13 వేల వరకూ ఉన్నాయి. ఏలూరులో ఎనిమిది వేలు, పశ్చిమలో ఐదు వేల దరఖాస్తులు ఇళ్ల నిర్మాణం కోసం వచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా ప్రభుత్వం కొంత సాయం అందిస్తే ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వీరి గురించి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కొంత అవకాశం కల్పించినా కొంతకాలంగా ఆ ప్రక్రియ పూర్తిగా నిలిపివేసింది. ఆన్‌లైన్ పూర్తయ్యి ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉలుకుపలుకూ లేకుండాపోయింది. దీంతో దరఖాస్తుదారులకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఇళ్ల నిర్మాణం చేసుకునే అర్హులైన పేదలకు ప్రభుత్వం రూ.లక్షా 80 వేలు సాయం అందిస్తోంది. ప్రభుత్వ సాయం అందితే మిగిలిన సొమ్ము అప్పు చేసైనా ఇంటి నిర్మాణం చేసుకోవాలని దరఖాస్తుదారులంతా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం సరైన స్పందన లేకుండాపోయింది. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ స్థానిక ప్రజాప్రతినిధులు ఇదే విషయమై ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి డిపిఆర్‌లు పంపించమని చెప్పిందని, త్వరలో ఇళ్ల నిర్మాణాలకు అవకాశం ఉంటుందని అధికారులు సమాధానం చెప్పినప్పటికీ ప్రజాప్రతినిధులు సంతృప్తి చెందిన పరిస్థితి లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా ఇదేవిధంగా చెబుతుండటంతో ఏఒక్కరికీ నమ్మకం కలగడం లేదు.
దిగిపోయేటప్పుడు ఇస్తే ఇబ్బందులే..
ప్రస్తుత ప్రభుత్వానికి మరో ఏడాది మాత్రమే పాలదనా అవకాశం ఉంది. మరో ఆరు నెలలకు ఎన్నికల కోలాహలం మొదలవుతుంది. వెంటనే సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకునేవారికి అవకాశమిస్తే ఎన్నికల సమయానికి పూర్తవుతాయి. అలాకాకుండా ఎన్నికల ముందు అనుమతిస్తే బిల్లులు వచ్చే పరిస్థితి ఉండదని ఇల్లు నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. గడిచిన టిడిపి పాలనలో ఆఖరి ఏడాదిలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఇప్పటికీ బిల్లులు రాని పరిస్థితి ఉంది. అప్పట్లో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకుండా వైసిపి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. దీంతో ఎంతోమంది లబ్ధిదారులు ఆప్పులపాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ విధంగా జరగకూడదంటే ప్రభుత్వం త్వరితగతిన అనుమతిస్తే సొంతింటి కల నెరవేర్చుకుంటామని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని అంతా కోరుతున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నందున వెంటనే అనుమతివ్వాలని అంతా ఎదురుచూస్తున్నారు. మొదటి ఫేజ్‌లో సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులకు ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి సాయం అందలేదని ఇటీవల జిల్లా పరిషత్ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు లేవనెత్తారు. వెంటనే ఆ సొమ్ము విడుదల చేయాలని ఇళ్లనిర్మాణదారులు కోరుతున్నారు.










