Sep 25,2023 22:07

సమస్యను వివరిస్తున్న బాధితులు

ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్‌ : జాతీయ రహదారి కోసం అధికారులు తాము అప్పుచేసి నిర్మించుకున్న గృహాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని తమను ఆదుకోవాలని గోరంట్ల మండలం బూదిలి గ్రామానికి చెందిన దళితులు కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ మేరకు వారు సోమవారం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూదిలి గ్రామంలో రహదారి ప్రక్కన దాదాపు 50 గృహాలు నిర్మించుకున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టాలు మంజూరు చేసిందన్నారు. దీంతో అప్పు చేసి గృహాలను నిర్మించుకున్నామన్నారు. సెంటు స్థలం 4 లక్షల రూపాయలు చేస్తుందన్నారు. అలాంటి స్థలాన్ని బెంగుళూరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తమ ఇళ్లను తీసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. సెంటు రూ. 4.50 లక్ష పలుకుతుండగా గోరంట్ల తహశీల్దార్‌ కేవలం సెంటు 16 వేల రూపాయలకు మాత్రమే మదింపు చేసి ఉన్నత అధికారులకు నివేదికలు పంపారన్నారు. తాము అప్పు చేసి దాదాపు 10 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించుకున్నామన్నారు. ఇప్పుడు జాతీయ రహదారి పేరుతో అతి తక్కువ ధరతో తమ గృహాలను లాక్కుంటే తాము గూడు లేక బజారు పాలు కావాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జిల్లా కలెక్టర్‌ తమ గ్రామాన్ని సందర్శించినప్పుడు 16 వేల రూపాయలకు మదింపు చేశారని కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా ఆయన తహశీల్దార్‌ను మందలించారన్నారు. తాము అప్పు చేసి నిర్మించుకున్న గృహాలను కేవలం సెంటు రూ.16 వేలకు మదింపు చేస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. వాస్తవ పరిస్థితులను గమనించి గూడు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని కోరారు. దళితులే గాక మరో 10 మంది బీసీలు ఇళ్లు కోల్పోతున్నారన్నారు. తాము న్యాయంగా పెట్టిన పెట్టుబడిని నష్టపరిహారంగా ఇప్పిస్తూ అనువైన చోట తమకు గృహాలు నిర్మించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మాజీ సర్పంచి భర్త సత్యనారాయణ, రామచంద్ర, రంగయ్య, ఆదినారాయణ, అశ్వర్థప్ప, మైనార్టీ నాయకులు రసూల్‌ బాషా, మెకానిక్‌ బాబు, మారెక్క, రమణమ్మ, శ్రీలక్ష్మి, సరోజమ్మ, ఓబులమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.