Nov 02,2023 22:04

ఇళ్లు కూల్చేయడంతో ఆరుబయటనే పిల్లలతో కలసి భోజనం చేస్తున్న కుటుంబం

         గార్లదిన్నె : రెక్కల కష్టం చేస్తే తప్పా రోజుగడవని జీవనం వారిది. ప్రతి రోజూ పనికి వెళ్తేనే పూటగడిచే పరిస్థితి. పాలకులు, ప్రభుత్వాల వివక్షకు గురైన దళిత, గిరిజన పేదలు వారంతా. ఇలాంటి పేదలపై ప్రభుత్వం, అధికారులు కక్షగట్టారు. రెక్కల కష్టంతో ప్రభుత్వ స్థలంలో ఉండేందుకు ఏర్పాటు చేసుకున్న నివాసాలను అధికారులు జెసిబిలతో కూల్చిపడేశారు. బుధవారం వేకువజామున గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో అధికారులు సాగించిన కూల్చివేతల దమనకాండ 200 పేద కుటుంబాల్లో చీకట్లను నింపింది. నిలువనీడలేక పిల్లాపాపలు, వృద్ధులు, మహిళలు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం వారంతా నిలువనీడలేక రోడ్డున పడ్డారు. ఎటు వెళ్లాలో పాలుపోక.. ఏమి చేయాలో దిక్కుతోచక కన్నీటి కష్టంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎవరిని కదిలించినా కన్నీరే సమాధానంగా వస్తోంది. ఎవరెళ్లినా 'సారూ మాకు న్యాయం చేయండి.. ఉండేందుకు కాసింత జాగా ఇప్పించండి'... అంటూ వేడుకుంటున్నారు.
గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో పది సంవత్సరాలుగా నిర్మించుకున్న గుడిసెలను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అధికారులు కూల్చివేశారు. అక్కడ నివసిస్తున్న బుడగ జంగం తెగకు చెందిన నిరుపేదలంతా ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బుధవారం ఉదయం నుంచి వారంతా ఆరబయటనే ఉంటున్నారు. గురువారం నాడు కూడా కూల్చివేసిన నివాసాల వద్దనే గడిపారు. ఉదయం కాలకృత్యాలు కూడా తీర్చుకునేందుకు కూడా అవకాశం లేక మహిళలు, వృద్ధులు అవస్థలు పడ్డారు. కనీస కూర్చేనేందుకు స్థలం లేక పిల్లలు ఎండ వేడిమిక సతమతం అయ్యారు. రాత్రికి చలికి జాగరణ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
రోడ్డున పడ్డాం
అంజలి, బాధితురాలు

         రోజు కష్టం చేసుకుంటూ జీవనం సాగించే జీవితం మాది. నాలుగేళ్ల క్రితం కల్లూరు గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. బుధవారం నాడు ఉన్నఫలంగా అధికారులు వచ్చి తమ గుడిసెలను కూల్చివేశారు. ఇంట్లోని సామగ్రి మొత్తం నాశనం అయ్యింది. నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారితో కలిసి గోడకింద ఉన్న నీడతో తలదాచుకుంటున్నాం.
వచ్చేసరికి కూల్చిపారేశారు..
సురేష్‌, కృష్ణ, శివన్న,
బాధితులు.

       ఊరూరా తిరిగి సర్కస్‌ చేసుకుని జీవనం సాగించే జీవనం మాది. ప్రతి రోజూ సర్కస్‌ నిర్వహించేందుకు ఏదో ఒక ప్రాంతానికి వెళ్లాల్సిందే. బుధవారం ఉదయం కూడా భార్యా పిల్లలతో కలిసి సర్కస్‌ చేయడానికి పక్క గ్రామాలకు వెళ్లాం. మధ్యాహ్నం వచ్చే సరిగా మా నివాసాలు అన్నీ కూలిపోయాయి. అధికారులు వచ్చి జెసిబిలతో కూల్చివేశారని స్థానికులు చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఏమి చేయాలో పాలుపోలేదు. ఏడుగురి చిన్న పిల్లలతో రాత్రంతా చలికి ఆరుబయటనే ఉన్నాం.
30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం..
లక్ష్మీదేవి, బాధితురాలు.

      30 సంవత్సరాలుగా కల్లూరులోని ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్నాం. ఆవులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ప్రస్తుతం నివసిస్తున్న చోటనే రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు ఉన్నాయి. తాము ఉంటున్న గుడిసెలను బుధవారం ఉదయం ఉన్నఫలంగా అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జెసిబిలతో కూల్చివేశారు. ఇదేమిటిని అడిగితే కనీసం అధికారులు స్పందించలేదు. ఇంట్లో ఉన్న సామగ్రిని తీసుకుంటామని అడిగినా వినకుండా కూల్చేశారు. నిలువనీడను కూల్చేస్తే తామెక్కడ ఉండాలి.