
మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తయిన తరువాత నాకు మా కాలేజీలో జరిగే ఎంపికలో ఒక పెద్ద అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. నాకెందుకో ఉద్యోగం చెయ్యటం ఇష్టం లేదు. మాకు మా ఊళ్లో 50 ఎకరాల పొలం ఉంది. అందులో 20 ఎకరాల మెట్ట పొలంలో మామిడితోట ఉంది. నాకు మొదట్నుంచీ మా ఊళ్లో ఏదైనా పరిశ్రమ పెట్టి, మా చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నది నా కోరిక.
అందుకే ఈ రోజు ఒక కన్సెల్టెన్సీ బృందాన్ని మా ఊరు తీసుకొచ్చాను. వాళ్లు మా తోట ప్రాంతాన్ని పరిశీలించి, ఆ స్థలం కర్మగారం పెట్టటానికి అనువైన స్థలమా? కాదా, నీటి వనరుల లభ్యత, రహదారులు, విద్యుత్.. ఇలా అన్నీ పరిశీలించి, సమగ్ర నివేదిక తయారుచేసిస్తారు.. అదే ప్రాజెక్టు నివేదిక.
ఆ బృందంలో ఆరుగురు సభ్యులున్నారు. ఇద్దరు ఇంజనీర్లు, ఒక పర్యావరణవేత్త, ఒక శాస్త్రవేత్త, మరో ఇద్దరు పదవీ విరమణ చేసిన ప్రభుత్వరంగ అధికారులు, ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్లు మా తోట ప్రాంతాన్ని పరిశీలించారు. తోట ప్రాంతం ఏటికి దగ్గరగా ఉండటంతో నీటి సమస్య లేదనీ, ఆ స్థలాన్ని ఎంపిక చేశాను. ఏటి నుంచి పైపులైన్ వేస్తే సరి.. ఏదైనా చిన్న పరిశ్రమ పెడితే 20 ఎకరాలు కావాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఆ తోట పచ్చటి మామిడి, కొబ్బరి చెట్లతో ఎన్నో రకాల పక్షులకు ఆవాసంగా ఉంది.
ఈ స్థలం కాక ఇంకో చెరువు దగ్గర మాకు 30 ఎకరాలుంది. అక్కడైతే ఏటికి దూరం వల్ల నీటికి ఇబ్బంది అవుతుంది. అలా ఆ కన్సెల్టెన్సీ ఆ రెండు స్థలాలనూ పరిశీలించి, వారం రోజుల్లో నివేదిక ఇస్తామని చెప్పి వెళ్లిపోయింది.
***
మర్నాడు ఉదయాన్నే నేను మా రైతు వెంకన్నతో కలిసి మా తోటకి వెళ్లాను.
ప్రభాత సమయం.. పక్షుల కిలకిలా రావాలు కీరవాణి రాగంలా వినిపిస్తూ ఆహ్లాదపరుస్తున్నాయి.. అప్పుడే తూరుపు సింధూర వర్ణాన్ని సంతరించుకుంటోంది.
'బాబూ! ఈ తోటలోనే తమరు ఏదో పేక్టరీ కడతారట.. నిజమేనా?' అని అడిగాడు వెంకన్న.
'అవున్రా! ఉద్యోగానికి వెళ్లటం నాకిష్టం లేదు.. అమ్మానాన్నలు ఇద్దరూ పెద్దవాళ్లైపోయారు కదా! వాళ్లని చూసుకునేందుకు నేనిక్కడే ఉండాలి'.
'బాబూ! ఏ పేక్టరీ ఎడతారు? నాకు ఉద్యోగం యిత్తారా?' అడిగాడు వెంకన్న.
'నూనెమిల్లు పెడదామనుకుంటున్నానురా..? మనూళ్లో వేరుశనగ, నువ్వులు బాగా పండుతాయి కదా! అందుకనీ నూనె తయారుచేసే ఫ్యాక్టరీ పెడితే నువ్వులు, వేరుశనగ నూనెలు తయారుచేసి, అమ్మొచ్చు. అప్పుడు నీకే కాదు ఊళ్లో చాలామందికి పని దొరుకుతుంది' అన్నాను.
పక్షుల కోలాహలం మొదలైంది. ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకు వేల పక్షులు చిత్రమైన అరుపులు చేస్తూ ఎగురుతుంటే నాకు ఆ వాతావరణం ఆనందం కలిగించ సాగింది.
ఎంతటి ప్రశాంతత.. పక్కనే తూర్పు వాహినిగా పారే ఏరు, దాని మీద నుంచి వీస్తున్న చల్లటి మలయమారుతం, చుట్టూ హరిత వర్ణపు ఏపుగా పెరిగిన చెట్లు.. గుబురుగా పెరిగిన మామిడి, మధ్యలో అక్కడక్కడా జీడిమామిడి, కొబ్బరి, ఉసిరి చెట్లు.. వాటిమీద రకరకాల పక్షుల గూళ్లు.
తెల్లటి కొంగలు నీలాకాశంలో ఎగురుతుంటే మల్లెదండలా కనిపిస్తున్నాయి. తోటలో ఇంకా గోర పిట్టలు, మైనా, రామచిలుకలు, గూడ కొంగలు, కోకిళ్లు, పావురాలు.. ఇలా ఎన్నో... కాకులైతే చెప్పక్కర్లేదు.. అక్కడక్కడ ఉన్న తాటిచెట్ల మీద వేలాడుతూ పిచ్చుక గూళ్లు.. ఈ మధ్య ఈ పిచ్చుకలు మా తోటలో తప్పా ఎక్కడా కనిపించటం లేదు. అలా నేను ఆనందంగా తిరుగుతున్న సమయంలో వెంకన్న కొబ్బరిబోండాం తెచ్చి, కొట్టిచ్చాడు..
'ఏంట్రోరు... కాయ నిండా నీరే...' అంటూ తృప్తిగా తాగేను.
'నేను, నాన్నగోరు దీన్ని గోదారి జిల్లా నుంచి తెచ్చినాము. ఇది మన పక్క కనిపించవు. యీటిని గంగాంబోండాలంటారు బాబూ.. పచ్చటి తోటని ఎందుకు బాబూ కొట్టేయటం.. ఈ తోటని తమ తాతగోరు వందేళ్ల కితం ఏసారట. అవి పెద్దవడానికి ఇన్నాళ్లు పట్టింది. మూడు తరాలోళ్లు దీన్ని సూసారు. ఈ తోటని నమ్ముకొని ఏల పచ్చులు బతుకుతానాయి. అలాంటిది ఈటిని పేక్టరీ కోసం కొట్టేస్తే, ఆటి బతుకు ఏటవుతుందోనని భయమేత్తోంది. ఆటి ఉసురు తమకి మంచిదికాదు.. ఆలోచించండయ్యా!' అన్నాడు వాడు చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ.. 'అవ్వా కావాలి.. బువ్వా కావాలి.. అంటే ఎలా రా వెంకన్నా? మనం బతకడానికి ఫ్యాక్టరీ కడుతున్నాము. అన్నీ ఆలోచిస్తే మనం ఏ పనీ చెయ్యలేము. కొన్ని కావాలంటే.. ఇంకొన్ని వదులుకోవాల్సిందే! పక్షులదేం ఉందిరా.. ఇంకో దగ్గరకి ఎగిరిపోతాయి. వాటి గురించి నువ్వేం గాబరాపడకు' అనీ వాడికి సర్ది చెప్పి, ఇంటివైపు బయలుదేరాను.
పైకి వాడితో అలా చెప్పాను కానీ వెంకన్న మాటలు నాలో ఆలోచనలు రేకెత్తించసాగాయి.
***
ఆ మర్నాడు నేను పొలానికి వెళ్తున్న సమయంలో వెంకన్న వచ్చి 'బాబూ! తమరి మామగారింటి దగ్గర గొడవ జరుగుతోంది' అని చెప్పాడు.
నేను ఆశ్చర్యపోతూ మామ ఇంటివైపు బయలుదేరాను.
మా ఇంటికి కొద్ది దూరంలోనే మా మామ కామేశం ఇల్లు. అతను మా ఊరి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసి, ఐదేళ్ల కిందట పదవీ విరమణ చేశాడు. అతనిద్దరి కొడుకులూ హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ఇక్కడ మా మావ కామేశం, అత్త సీతమ్మ ఉంటారు.
నేను వడివడిగా వాళ్లింటికి చేరుకున్నాను. నన్ను చూసి మా మావ బోరున ఏడుస్తూ 'చూడరా మధూ! ఎంతటి అన్యాయం చేశారో నా కొడుకులు?' అన్నాడు.
ఇంతలో లోపల్నుంచి మా అత్త సీతమ్మ కూడా వచ్చింది. నన్ను చూస్తూనే ఆమె కూడా ఏడుపు మొదలెట్టింది. అక్కడ మా ఊరి సర్పంచ్ కిష్టప్పతో సహా మరికొంత మంది రైతులున్నారు.
నేను వాళ్లని చూసి 'మీరంతా ఎందుకొచ్చారు?' అని అడిగాను.
అప్పుడు సర్పంచ్ కిష్టప్ప 'మధుబాబూ... మీ మామగారి అబ్బాయిలిద్దరూ ఈ ఇంటిని నాకు రెండు నెలల క్రితం అమ్మేశారు. డబ్బు కూడా పూర్తిగా ఇచ్చేశాను. రేపు రిజిస్ట్రేషన్. అందుకు మీ మామగారు, అత్త సంతకాలు చెయ్యాలి. ఇప్పుడు వాళ్లు సంతకాలు చేయమనీ, ఇల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చెయ్యమనీ చెబుతున్నారు' అనీ అన్నాడు.
'మధూ! ఇది అన్యాయం కదురా.. నాకు తెలియకుండా ఇల్లు ఇతను కొనడం అన్యాయం కాదు? నా చెవిన ఒక్క మాట వెయ్యొద్దా? డబ్బులు వాళ్లకు ఇచ్చేసి, ఇప్పుడు సంతకాలకి మేము కావాలా? ఉన్నపళంగా మేమెక్కడికి వెళ్లిపోవాలి చెప్పు? ఇదంతా నా కొడుకులతో చేతులు కలిపి ఈ కిష్టప్ప చేసిన కుట్ర' అన్నాడు మావ కోపంగా.
నా కెందుకో కిష్టప్ప చేసిన పని నచ్చలేదు.
'కిష్టప్పా! నువ్వు ఊరి సర్పంచివై ఉండీ ఇలా చెయ్యొచ్చా? మావతో ఆ విషయం చెప్పకుండా ఇంటిని ఎలా కొన్నావు? ఇది తప్పు కదా? ఇప్పుడీ వృద్ధులు ఎక్కడికెళతారు చెప్పు? కనీసం మాట వరసకైనా మాతో ఎందుకు చెప్పలేదు?' అన్నాను కోపంగా సర్పంచ్‌తో.
'మధుబాబూ! మీ మావగోరి కొడుకులిద్దరూ నా దగ్గరకొచ్చి ఆళ్లకి అర్జెంటుగా డబ్బు అవుసరం పడిందనీ నాన్న ఇల్లుని అమ్మమన్నారనీ, ఆళ్లని మేము తీసికెళ్లిపోతామనీ సెప్పడంతో నాను నమ్మి, డబ్బులిచ్చి కొన్నాను. ఇన్ని గొడవలుంతాయనీ నాకేటి తెలుసు?' అన్నాడు కిష్టప్ప.
ఏదైనా నీది తప్పు... ఊరందరికీ పెద్ద అయ్యిన నువ్వు అలా చెయ్యవలసింది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటిని అమ్మే ప్రసక్తి లేదు. మా మావ, అత్తా ఇద్దరూ బతికున్నన్నాళ్లు ఈ ఇల్లు వాళ్లదే.. ఈ ఇల్లు వారసత్వపు ఆస్తి కాదు. ఇది మా మామ తను సంపాదించిన డబ్బుతో కట్టుకున్నాడు. ఇది వాళ్ల తదనంతరం మాత్రమే కొడుకులకి చెందుతుంది. కాబట్టి నువ్వు వాళ్లని ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపో' అన్నాను.
'మరి నాన్నిచ్చిన సొమ్ము?' అన్నాడు కిష్టప్ప..
'నువ్వు ఎవర్నడిగి ఇచ్చావు.. మాకేమైనా చెప్పావా? నువ్వు ఎవ్వరికైతే ఇచ్చావో వాళ్లనే అడుగు.. నువ్వు మళ్లీ ఇలా ఇంటికి వచ్చి, ఈ వృద్ధుల్ని అల్లరి చెయ్యడం మంచిది కాదు' అన్నాను కోపంగా.
వాడు కోపంగా లేచి నిలబడి 'నా సొమ్మెలా రాదో నేనూ సూత్తాను.. అవసరం పడితే ఆళ్లిద్దరి మీదా కేసెడతాను' అంటూ లేచి వెళ్లిపోయాడు. వాడి వెనకాలే మిగతా రైతులు వెళ్లిపోయారు.
మా మావ నా దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని 'అల్లుడూ! నువ్వు చేసిన సాయం ఈ జన్మలో మరువను.. నువ్వే లేకపోతే ఇవాళ మేము రోడ్డున పడేవాళ్లం' అన్నాడు.
'నువ్వేం భయపడకు మావా.. ఇప్పుడే బావలిద్దరితోనూ మాట్లాడి, పిలిపించి డబ్బుని వాడికిప్పిస్తాను..' అని చెప్పి, ఇంటి కొచ్చేశాను.
'బాబూ! తమరే లేకపోతే ఇయాల ఆ కిట్టప్ప గోడు ఆ ఇంటిని రాయించేసుకునేవోడే.. తమరు గట్టిగా బుద్ధి సెప్పారు' అన్నాడు వెంకన్న.
ఆ రోజు రాత్రి మా మేనబావలిద్దరితోనూ మాట్లాడాను. పెద్దవాడు గిరి... ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.. రెండోవాడు శంకరం.. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వాడిది.
ఇద్దరితో ఇక్కడ జరిగిన గొడవ చెప్పి.. వెంటనే రమ్మనమనీ, లేకపోతే ఇక్కడ గొడవలు అయ్యేటట్లున్నాయనీ చెప్పడంతో ఆదివారం నాడు వస్తామనీ వాళ్లిద్దరూ చెప్పారు..
అనుకున్నట్లుగానే ఆ ఆదివారం వాళ్లిద్దరూ వచ్చారు.
నేను వాళ్లతో కలిసి మావ ఇంటికి వెళ్లాను.
'గిరీ! మీ నాన్నకి, అమ్మకి తెలియకుండా ఇల్లమ్మడమేమిట్రా? మీ అమ్మానాన్నలెక్కడ
ఉంటారనుకున్నార్రా! కొడుకులైన మీరే ఇలా చేస్తే ఎలా చెప్పండి?' అనీ కోప్పడ్డాను.
డబ్బు అత్యవసరం పడి అలా చెయ్యవలసి వచ్చింది. అమ్మానాన్నల్ని మాతో తీసికెళ్లిపోదామనీ అనుకున్నాము' అన్నాడు గిరి.
'మధూ.. వాడు చెప్పింది పచ్చి అబద్ధం... క్రితంసారి వాళ్లిద్దరూ ఏదో కూడబలుక్కొనే ఇక్కడికి వచ్చారు. మేమేదో సెలవులకి మమ్మల్ని చూడటానికి వచ్చారనీ అనుకున్నాము. ఇప్పుడేమో మాటమారుస్తున్నారు. పక్క మేస్టారు గారు నిన్న నాతో చెప్పారు. మమ్మల్నిద్దర్నీ వృద్ధాశ్రమంలో చేర్పిస్తామనీ అతనితో చెప్పారట. వీళ్లు తల్లితండ్రులకే ద్రోహం తలపెట్టిన నీచులు' అన్నాడు మా మామ వీరావేశంతో.
'మీరు చేసిన పని నాకు నచ్చలేదురా.. మీరు మీ కుటుంబానికే తలవంపులు తెచ్చారు. ఆ ఇల్లు అమ్మడానికి మీకేవిధమైన హక్కూ లేదు. అది మీ నాన్న స్వార్జితం. అది పిత్రార్జితం కాదు. అలా అమ్మినందుకు మీ మీద పోలీసుకేసు పెడితే మీరు జైలుకెళ్లడం ఖాయం. కొడుకులు పుడితే తమకు పున్నామ నరకం తప్పుతుందనీ ప్రతి తల్లితండ్రీ కోరుకుంటారు. అటువంటిది మీరు వాళ్లు ఉంటున్న ఇంటినే అమ్మి, ఇక్కడే నరకం చూపించబోయారు. సర్పంచ్ కిష్టప్ప దగ్గర తీసుకున్న డబ్బును వెంటనే అతనికిచ్చేయండి. లేకపోతే నేను చూస్తూ ఊరుకోను' అన్నాను కోపంగా.
'బావా! తప్పైపోయింది. కానీ ప్రస్తుతానికి ఆ డబ్బు మా దగ్గర లేదు. ఇద్దరం కలిసి ఇళ్లు కొనుక్కున్నాము. అందుకా డబ్బుని వాడుకున్నాము.. కావలిస్తే నోటు రాసి అతనికిస్తాము' అన్నాడు రెండోవాడు శంకరం.
'చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది మీ వ్యవహారం. నోటు రాస్తే ఆ కిష్టప్ప ఒప్పుకుంటాడా చెప్పండి? అసలేవాడు డబ్బు మనిషి, డబ్బు కోసం ఏ గడ్డి అయినా తినే రకం'.
'బావా! ఇప్పుడేం చెయ్యమంటావు? డబ్బైతే లేదు.. ఉన్నవన్నీ ఇంటికోసం ఇచ్చేశాము. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. ఒక సంవత్సరం ఆగితే ఆ ఐదు లక్షలూ తెచ్చిస్తాము' అన్నాడు గిరి.
'ప్రస్తుతానికి నేను ఆ డబ్బుని కిష్టప్పకిచ్చి, బాకీ తీరుస్తాను. నాకు మీరు ప్రో నోటు రాయండి. ఇంక మీ అమ్మానాన్నలు హాయిగా ఆ ఇంట్లోనే ఉంటారు. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు పని చెయ్యకండి. తల్లీతండ్రి దైవ సమానులు. వాళ్లను బాధపెడితే మీకు మంచిది కాదు'. అని చెప్పడంతో వాళ్లు మౌనం వహించారు.
మా మావ నా చేతులు పట్టుకొనీ 'నీ సహాయం మరువలేమురా మధూ..!' అన్నాడు.
***
వారం రోజుల తరువాత ఆ కన్సెల్టన్సీ వాళ్లు నాకు ఓ నివేదిక ఇచ్చారు. మా తోట ఉన్న ప్రాంతం పరిశ్రమ పెట్టేందుకు అనువైన ప్రాంతమనీ, దానికి మొదట ప్రాధాన్యత ఇస్తూ నివేదిక రూపొందించారు. రెండో ప్రాధాన్యతగా ఆ చెరువు దగ్గర ఉన్న 30 ఎకరాల మెట్టను పేర్కొన్నారు.
'బాబూ! ఆళ్లు ఎక్కడ పేక్టరీ కట్టమని సెప్పారు' అన్నాడు వెంకన్న..
ఆ రోజు నేను వాడూ కలిసి తోటకి వెళ్లాము.
'ఈ తోటని కొట్టి, ఇక్కడే కట్టమనీ చెప్పారు' అన్నాను.
'బాబూ! నిన్న తమరి మావ గోరు ఇంటిని కొడుకులమ్మేత్తే ఆళ్లకు ఇల్లు లేకపోతే ఎక్కడుంటారని అడ్డం పడ్డారు.. మరి ఈ తోటని కొట్టేత్తే ఇక్కడున్న సెట్లమీద గూళ్లు కట్టుకున్న పచ్చులు, పిట్టలు కూడా తమరి మావగోరిలానే గూళ్లు లేనివైపోతాయి కదా బాబూ..? మరి ఈ పచ్చుల గురించి ఆలోసించరా బాబూ!' అన్నాడు వెంకన్న అమాయకంగా.
ఆ సమయంలో ఆ నిరక్షరాస్యుడు వెంకన్న అమాయకంగా అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు.. దాంతో సిగ్గుపడి మౌనం వహించాను.
సూటిగా, నిజాయితీగా వాడడిగిన ప్రశ్న నాలో అంతర్మధనాన్ని కలిగించింది.
ఆ తరువాత ఇంటికి వచ్చి ఆలోచించడం మొదలుపెట్టాను.
నాలో చెప్పలేని ఘర్షణ మొదలైంది. మావకు ఒక న్యాయం? అమాయకమైన పక్షులకు ఇంకో న్యాయమా? ఇలా భిన్నంగా వ్యవహరించడం తప్పు కాదా?!.. 'పచ్చటి తోటని కొట్టి, కొన్ని వేల పక్షులకు ఆవాసం లేకుండా చెయ్యటం ఏవిధంగా న్యాయం?' అన్న ఆలోచన నన్ను వెంటాడసాగింది.
ఆ రాత్రంతా నాకు నిద్రలేదు.. తప్పు చేస్తున్నానన్న భావన నాలో బలపడసాగింది.
'ఒక అమాయకుడైన వెంకన్నకుండే దృష్టి నాకెందుకు లేదు..?' ఆలోచనలతో నా మనస్సు వేడెక్కి పోసాగింది.
***
వారం రోజుల తరువాత నేను ఆ తోటని కొట్టకుండా ఆ చెరువు ప్రాంతం దగ్గర ఫ్యాక్టరీ కట్టాలనీ నిర్ణయించుకున్నాను.
ఆ రోజు ఉదయాన్నే తోటకి వెళ్లినపుడు విషయం వెంకన్నకి చెప్పినపుడు వాడి కళ్లల్లో కనిపించిన మెరుపు నాకు ఎంతో ఆనందం కలిగించింది.
గన్నవరపు నరసింహమూర్తి
7752020123