ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : పట్టణంలో పలు కాలనీల్లో రోడ్లు సక్రమంగా లేవని, విద్యుత్‌స్తంభాలు కూడా లేవని ఈ సమస్యలన్నీ గుడ్‌మార్నింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి కన్పించలేదా అని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు. బుధవారం పట్టణంలోని 3వ వార్డులో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పరిటాలశ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ పథకాలగురించి వివరించారు. ఈ సందర్భంగా పరిటాలశ్రీరామ్ మాట్లాడుతూ 1 నుంచి 10వ వార్డులలో రోడ్లు సరిగాలేవని, విద్యుత్ స్తంభాలు కూడా సక్రమంగా లేవని అన్నారు. వీటిని పరిష్కరించకుండా గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రానున్న ఎన్నికలలో ఈ అవినీతి అరాచక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌ఛార్జి రాళ్లపల్లి షరీప్, టీడీపీ యూనిట్ ఇన్‌ఛార్జి కరెంటు ఆది, నాయకులు మేకల లోకేశ్, రఫీ, నాగేంద్ర, ఓబుళేసు తదితరులు పాల్గొన్నారు.










