కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
ప్రజాశక్తి - ఏలూరు
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణులకు అందజేస్తున్న కోడిగుడ్ల పంపిణీలో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. శుక్రవారం బగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రం, చాటపర్రు పిహెచ్‌సి, మాదేపల్లిలోని లింగారావుగూడెంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణి గంజి విశ్రాంతికి రెండు వారాల నుండి కోడిగుడ్లు అందజేయకపోవడంపై అంగన్‌వాడీ కార్యకర్తలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గర్భిణిని పిలిపించి కోడిగుడ్లు ట్రేలను అందించారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించే దిశలో నాణ్యమైన కోడిగుడ్లు అందజేయాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అంగన్‌వాడీ కార్యకర్తను హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రం హాజరు రిజిస్టర్‌ను కలెక్టర్ పరిశీలించి పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం చాటపర్రులోని పిహెచ్‌సిని తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది హాజరుకు సంబంధించిన ఎఫ్‌ఆర్‌ఎస్ రిపోర్టును అడగ్గా దాన్ని సిబ్బంది చూపకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఆసుపత్రికి వస్తున్న ఔట్‌పేషెంట్లకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, మందుల లభ్యత, ఆరోగ్యకేంద్రంలో మౌలిక వసతులు, తాగునీటి లభ్యత, ఆసుపత్రి పరిశుభ్రత తనిఖీ చేశారు. లింగారావుగూడెంలోని కనకదుర్గా రైస్‌మిల్‌ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఎగుమతులు, దిగుమతులు, స్టాక్ రిజిస్టర్, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం, గోనె సంచులు, తేమశాతం యంత్రం పరిశీలించారు. కలెక్టర్ వెంట డాక్టర్లు, ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.










