Sep 29,2023 21:42

గుడి జాగా..వేసేరు పాగా

పీలేరు : కబ్జాకు కాదేదీ అనర్హం అంటూ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. అధికారులకు తెలి సినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పీలేరు పట్టణ శివారులో గుడి కోసం కేటాయించిన స్థలాన్ని కూడా కబ్జాదారులు వదలడం లేదు. కబ్జా స్థలంలో ఒక్క రోజులోనే గోడలు వెలిశాయి. మరుసటి రోజు మౌల్డింగ్‌ కోసం సెంట్రింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ విషయంగా స్థానికులు సంబంధిత రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో కబ్జాదారుల ఆటలు సాగుతు న్నాయి. మండలంలోని బోడుమల్లువారిపల్లి పంచాయతీ, వినాయక నగర్లో శ్రీసీతారాముల ఆలయ నిర్మాణం కోసం 2019 ఫిబ్రవరి 5న అప్పటి పీలేరు మండల తహశీల్దార్‌ సర్వే నెంబర్‌:137/ఏలో 6 సెంట్ల స్థలం కేటాయించారు. ఆ స్థలంపై కన్నుపడ్డ ఓ వ్యక్తి నకలీ పట్టా సష్టించి ఆ జాగా తనదేనంటూ అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డాడని ఆలయ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై స్థానిక తహశీల్దారుకు తాము ఫిర్యాదు చేశామని, చర్యలకు తమ సిబ్బందిని ఆదేశించినా వారు తగిన రీతిలో స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇకనైనా తగిన చర్యలు తీసుకుని కబ్జాకు గురవుతూన్న ఆలయ స్థలాన్ని తిరిగి తమకు అప్పగించాలని రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.గుడి స్థలంలో వెలసిన అక్రమ కట్టడం