''ప్రభుత్వోద్యోగుల జీతాలు పెంచితే ప్రజల సంక్షేమం దెబ్బ తింటుంది.'' - ఇది ప్రభుత్వ పక్ష ప్రతినిధుల వాదన, అధికార పార్టీ నేతల ప్రచారం.
ప్రజల సంక్షేమానికి, ఉద్యోగుల జీతాల పెంపుదలకి మధ్య పోటీ పెట్టి చేసే ఈ వాదన పాలకవర్గ సిద్ధాంతానికి ప్రతిరూపమే.
మరో సందర్భంలో ''ఇలా సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు చేస్తూవుంటే ఇక రాష్ట్రాభివృద్ధి ఏ విధంగా సాధ్యపడుతుంది?'' అన్న వాదన కూడా వినపడుతోంది.
ఇక్కడ పేదల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికీ మధ్య పోటీ పెట్టి వాదిస్తున్నారు.
మరో సందర్భంలో ''రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటే నిధులెక్కడినుంచి వస్తాయి?'' అంటూ చర్చ పెడతారు.
ఇక్కడ రైతు సంక్షేమానికి, రాష్ట్రం నిర్వహణకు మధ్య పోటీ పెడుతున్నారు.
''ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు పెంచండి'' అని వ్యవసాయ కూలీలు అడిగితే ''ఆ విధంగా కేటాయింపులు పెంచాలంటే ప్రజలమీద అదనంగా పన్నుల భారం మోపవలసివస్తుంది'' అంటారు.
ఇక్కడ వ్యవసాయ కూలీలకు, ప్రజలకు మధ్య పోటీ పెడతారు.
''నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించండి, అంతవరకూ నిరుద్యోగ భృతి ఇవ్వండి'' అని అడిగితే అప్పుడు ఆ నిరుద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య పోటీ పెడతారు.
కాని,
ఇసుక రేటు అమాంతం పెంచేసినప్పుడు ఈ రాజకీయ నాయకులకి ఆ ప్రజలు గుర్తుకు రారు.
చెత్త పన్ను వేసి వసూళ్ళ కోసం బెదిరింపులకు కూడా సిద్ధపడినప్పుడు తాము బెదిరిస్తున్నది ఆ ప్రజలనే అని అనుకోరు.
ఆస్తిపన్ను అన్యాయంగా పెంచినప్పుడూ ప్రజలు గుర్తుకు రారు.
ప్రజలకోసం పోరాడే ఉద్యమకారుల మీద పోలీసులను ప్రయోగించి అణచివేయమని ఆదేశాలిచ్చే సమయంలో ఈ ప్రభుత్వం ఎన్నడూ ''అయ్యో! ఈ ఉద్యమకారులు ప్రజల గురించి కదా అడుగుతున్నారు?'' అని అనుకోదు.
పాలకవర్గపు దమననీతిలో ఒక వైపు ఉద్యమాలను, పోరాటాలను అణచివేయడం అనేది ఉంటుంది. మరోవైపు పోరాడుతున్న తరగతులకు, తక్కిన ప్రజలకు నడుమ పోటీ పెట్టి ప్రజల మధ్యే చీలికలు తీసుకురావడం అనేది కూడా ఉంటుంది.
కార్మికులు సమ్మె చేయడానికి సన్నద్ధం అయితే ''సమ్మెల వలన దేశానికి నష్టం. ప్రజలకు అసౌకర్యం'' అని వెంటనే ప్రభుత్వం ప్రకటిస్తుంది. కార్మికులను అణచివేయడానికి ఎస్మా వంటి చట్టాలను తీసుకువస్తూ వాటిని తెచ్చింది ప్రజల కోసమే అని సమర్ధించుకుంటుంది.
ఈ ద్వంద్వ నీతి సామాజిక అంశాలలోనూ మనకి కనిపిస్తుంది.
గ్రామాల్లో ఉన్న కుల వివక్షను రూపు మాపాలని మనం గనుక ప్రచారం చేపడితే వెంటనే అక్కడున్న పోలీసులు, పెత్తందారులు మన దగ్గరికి వచ్చి ''మీరు గ్రామంలో అడుగు పెట్టకముందు వరకూ ఈ గ్రామం ప్రశాంతంగా ఉంది. మీరే ఇక్కడ వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు'' అని మనల్ని నేరస్తులుగా చిత్రిస్తారు. ఆ గ్రామంలో వివక్ష పాటిస్తున్న విషయం గురించి నోరెత్తరు. గ్రామం ప్రశాంతంగా ఉందని మాత్రం అంటారు. అంటే వివక్షను మౌనంగా దళితులు భరిస్తూ ఉండాలి. ఎదురుతిరిగి ప్రశ్నించకూడదు. వివక్షను ప్రశ్నించడం అంటే శాంతి, భద్రతలకు ప్రమాదం. ఇది పెత్తందారుల తరఫున చేసే వాదన కాదా? ఎవరి శాంతి, భద్రత గురించి పోలీసులు వాపోతున్నారు? దళితులకు శతాబ్దాలుగా కరవైన శాంతి, భద్రతల గురించి మాట్లాడరెందుకు?
''మీ మహిళా సంఘాలు వచ్చి కుటుంబాల్లో తగువులు తెస్తున్నాయి. మీరిక్కడ సంఘం పెట్టకముందు వరకూ కుటుంబాలు సజావుగా నడిచాయి'' అనే మహానుభావులూ ఉన్నారు. వీరంతా కుటుంబాల్లో మహిళల మీద పెత్తనాన్ని చెలాయించే ప్రబుద్ధుల తరఫున వకాల్తా పుచ్చుకన్నవారేనని వేరే చెప్పన్కరలేదు.
''మీరు వచ్చి సంఘాలు పెట్టేంతవరకూ మా ఫ్యాక్టరీలో చాలా ప్రశాంత వాతావరణం ఉంది. మీరు సంఘం పెట్టాక ఇక్కడ వాతావరణం చెడిపోయింది'' అని అనని ఫ్యాక్టరీ యజమానిని ఒక్కరినైనా చూడగలమా? ''సంఘాల వలనే దేశం చెడిపోయింది'' అని ప్రవచించే మేథావులూ చాలామంది మనకి తారసిల్లుతూ వుంటారు. దేశంలో ఎక్కువ పని దినాలు నష్టపోయినది సంఘాలవల్లనో, సమ్మెల వల్లనో కాదని, యజమానుల అక్రమ మూసివేతల వలన, తొలగింపుల వలన, లే ఆఫ్ ల వలన 90 శాతం పని దినాలు నష్టపోయామని గణాంకాలు చెప్పేది ఈ మేథావులకి పట్టదు.
''గత 75 ఏళ్ళుగా హక్కుల గురించి మాట్టాడినందువల్లనే దేశం చెడిపోయింది. ఇక ముందు చర్చ అంతా చేయబోయే తపస్సు గురించే'' అని స్వయానా ప్రధాని మోడీ శలవిచ్చారు ! అంటే ఇక ముందు ప్రజల హక్కుల ఊసెత్తకూడదు. కార్పొరేట్ల ముక్తి కోసం మోడీ చేసే తపస్సుకి మనం ఎవరూ భంగం కలిగించకూడదు.
''ఉద్యోగులకి జీతాలు పెంచాలంటే ఎక్కడి నుంచి తేవాలి?'' అని అడిగే ప్రభుత్వ నేతలు కార్పొరేట్లకు భారీగా పోటీపడి మరీ రాయితీలు ప్రకటించేటప్పుడు, పన్ను మినహాయింపులు ఇచ్చేటప్పుడు '' ఇలా రాయితీలు ఇచ్చుకుంటూ పోతే తగ్గే ఆదాయాన్ని ఎక్కడినుంచి సమకూర్చుకోవాలి?'' అన్న సందేహం ఏ మాత్రమూ కలగదు. ఎందుకో?
రైతులకు రుణాలను మాఫీ చేయాలంటే ''బ్యాంకులు దివాలా తీస్తాయి'' అనో, ''ప్రభుత్వ ఖజానా గుల్లవుతుంది'' అనో గోల చేస్తారు. అదే లక్షల కోట్లు కార్పొరేట్ పారు బకాయిలను రద్దు చేసేటప్పుడు ఆ మాటలు రావు. ''దేశాన్ని వృద్ధిబాటలో నడిపించే సృజనాత్మక చర్యలు''గా ఆ బకాయిల రద్దును అభివర్ణిస్తారు.
ఎందుకిదంతా ?
అయ్యా! మనం కార్పొరేట్ దోపిడీ విచ్చలవిడిగా సాగిపోతూన్న ఒక దోపిడీ సమాజంలో ఉన్నాం. ఇక్కడ పాలకులదొక నీతి, ప్రజలకి మరో నీతి. పాలకులను ప్రశ్నిస్తే దేశద్రోహం. ఉద్యమాలు నడిపితే అది శాంతికి విఘాతం. ఈ మౌలిక సత్యాన్ని ముందు గుర్తించి ఆ తర్వాత ప్రభుత్వోద్యోగుల ఆందోళన గురించి మాట్లాడడం మంచిది.
ప్రభుత్వోద్యోగుల ఆందోళనను సమర్ధించితే అందుకు కొందరు తప్పుబడుతున్నారు. అలా తప్పుపట్టేవారంతా ప్రభుత్వం తరఫున వకాల్తా తీసుకున్నారనో, పాలకుల ఏజంట్లనో అనడం తప్పు. కాని వారి దృష్టిలో లోపం ఉందని మాత్రం చెప్పవచ్చు.
ప్రభుత్వోద్యోగులు వేరు, ప్రజలు వేరు అని చూడడం తప్పు. ఎన్ని రంగాల్లో, ఎన్ని రకాల పనుల్లో ప్రభుత్వోద్యోగులు పని చేస్తున్నారో చూడండి. ప్రస్తుతం మనని పీడిస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుతున్నది, అందుకోసం తమ ఆరోగ్యాలను కూడా రిస్క్‌లో పెట్టుకుంటున్నది ఎవరు ? వారు ప్రభుత్వోద్యోగులు కారా? గ్రామ సచివాలయాల ఉద్యోగుల నుండి వివిధ స్థాయిల్లో సంక్షేమ పథకాల అమల్లో భాగస్వాములౌతున్నది ప్రభుత్వోద్యోగులు కారా? కరోనా కాలంలో మనల్ని కాపాడిన ఆరోగ్య కార్యకర్తలలో చాలా మందికి ఈ ప్రభుత్వం నెలల తరబడి జీతాలను చెల్లించకుండా బకాయిలు పెట్టింది. ఈ విషయాన్ని మనం విస్మరించవచ్చా?
''ప్రభుత్వ టీచర్లెవరూ పనులు చేయరు'' అని చాలా తేలికగా చెప్పేస్తూంటారు కొందరు. కాని ఈ కరోనా కాలంలో 900 మందికి పైగా ప్రభుత్వ టీచర్లు తమ తమ విధుల నిర్వహణలో ప్రాణాలనే కోల్పోయిన సంగతి వారికి తెలుసా ?
వాటర్ వర్క్స్, శానిటరీ, పబ్లిక్ హెల్త్, పోలీస్, రవాణా, విద్యుత్ సరఫరా తదిరత విభాగాలలో ఇన్ని కోట్లమంది ప్రజల అవసరాలను అందుకోగలగుతున్నది ప్రభుత్వ ఉద్యోగులే తప్ప కార్పొరేట్లు కాదు.
ఈ వాస్తవాలను విస్మరించి, ప్రభుత్వోద్యోగులు కూడా ప్రజలే అన్నది మరిచిపోయి, ప్రభుత్వోద్యోగులంటే ''ప్రజలపై పెత్తనం చేసే రాజ్యాంగ యంత్రంలో భాగమే'' అంటూ ప్రచారం చేస్తున్నారు కొందరు. తమ వాదనను సమర్ధించుకోడానికి మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ ల పేర్లను కూడా వాడేస్తున్నారు. నిరంకుశ అధికార యంత్రాంగానికి, ఆ పెత్తనం కింద పని చేసే సాధారణ ఉద్యోగులకు నడుమ తేడాను వీరు చూడలేకపోతున్నారు. ఉద్యమకారులపై లాఠీ ఎత్తే పోలీసుకు, లాఠీచార్జికి ఆదేశించే పోలీసు ఉన్నతాధికారికి తేడా చూడలేకపోతున్నారు. ''మాలోని మనిషివే, మా మనిషివే నీవు, పొట్ట కూటికే నీవు పోలీసువైనావు'' అంటు విప్లవ కవి చెరబండరాజు రాసిన పాట గుర్తుకు తెచ్చుకోవాలి వీరు.
ప్రభుత్వోద్యోగులంటే లంచగొండులని, వారికి మీరు మద్దతివ్వడమేమిటని మరికొంతమంది అడుగుతున్నారు. చేట లోని బియ్యంలో ఉండే రాళ్ళను చూసి మొత్తం బియ్యాన్నే పారేసే వారి విజ్ఞత ఎలాంటిదో, వీరిదీ అటువంటి విజ్ఞతేనని అనుకోవాలి. బియ్యం మధ్యలో ఉండే రాళ్ళను ఏరిపారేస్తామే తప్ప బియ్యాన్ని కాదు అని వీరు గమనించాలి.
ఉద్యోగులలో ఉన్న లంచగొండుల మీద పోరాటం చేయడానికి, మొత్తం ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వడానికి తేడా ఉంది. ప్రజల్లో లంచగొండుల మీద వ్యతిరేకత ఉంది తప్ప మొత్తం ఉద్యోగులమీద కాదు.
ఈ వ్యవస్థలో అవినీతి పైనుంచి కిందికి ప్రవహిస్తుంది. కార్పొరేట్ అవినీతి అన్నింటికన్నా పెద్దది, భారీ స్థాయిలోది. దానికి కొమ్ముకాసే రాజకీయ పార్టీలది, ప్రభుత్వాధినేతలది అత్యంత ప్రమాదకరమైన అవినీతి. దిగువ స్థాయి ఉద్యోగులలో కొందరిలోని అవినీతి మాత్రం మనకి తొందరగా, తేలికగా కనిపిస్తుంది. వేల కోట్ల కార్పొరేట్ డొనేషన్లను పొందుతూ, ఆ వివరాలను బైటపెట్టనవసరం లేదని కూడా దబాయించి చెప్పే బిజెపి రాజకీయ అవినీతి, పెగాసస్ అవినీతి, రాఫెల్ అవినీతి, కార్పొరేట్ పారు బకాయిల అవినీతి, చట్టబద్ధంగానే ప్రభుత్వ రంగ ఆస్తుల్ని కారు చౌకగా ఆ కార్పొరేట్లకు సమర్పించుకునే ప్రైవేటీకరణ, మానెటైజేషన్ అవినీతి, నయా ఉదారవాద అవినీతిలో అంతర్భాగమే. అదెంత భయంకరం! ఎంత ప్రమాదకరం! ఆ అవినీతిని, గవర్నమెంటాఫీసులో బిళ్ల బంట్రోతు మామూళ్ళని ఒకే విధంగా చూస్తే ఎలా? కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరి లక్షలకు లక్షలు మారు మాట్లాడకుండా వాళ్ళకి సమర్పించుకుంటూ, ప్రభుత్వాస్పత్రిలోని వార్డుబోరు అడిగే మామూలు గురించి ఉపన్యాసం దంచితే ఎలా? పోటీ ప్రపంచం అంటూ కార్పొరేట్ చదువుల బందెల దొడ్లోకి పిల్లల్ని తోలేసి, ప్రభుత్వ టీచర్ల గురించి తేలికగా మాట్లాడితే ఎలా?
ఇప్పుడు పాలించే ప్రభుత్వంతో దాని కింద పని చేసే ఉద్యోగులు పోరాడుతున్నారు. అంటే యజమానితో ఆ కింద పని చేసే ఉద్యోగులు పోరాడుతున్నారు. మనం ఈ పోరాటంలో యజమాని వైపు ఉందామా? లేక ఉద్యోగుల వైపు నిలబడదామా? మీరే చెప్పండి !
సుబ్రమణ్యం










