Feb 06,2022 07:05

    క ఆఫీసులో స్టెనోగ్రాఫర్‌గా పని చేసే సాధన అనే అమ్మాయికి ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలన్నది చిన్ననాటి కల. ఆ స్వప్నం నెరవేరకుండానే వివాహమైంది. కుటుంబ అవసరాల కోసం ఉద్యోగం చేయాల్సివచ్చింది. సాయంత్రం అయ్యేసరికి అలిసిపోయి ఇంటికి చేరేది. ఇంటికి రాగానే పసిబిడ్డ ఆలనా పాలనతో పాటు ఇంటి పనులూ తప్పేవికావు. ఇన్ని ఒత్తిళ్ల మధ్య కూడా ఆమె తన కలల సామ్రాజ్యంలో ఈదులాడుతుండేది. ఆఫీసులో తన టేబుల్‌ పైన 'సాధన ఐఏఎస్‌' అని రాసుకునేది. అందరూ ఆమెను చూసి నవ్వుకొనే వాళ్ళు. అయినా, పట్టుదలతో ఆ అమ్మాయి ఐఏఎస్‌ సాధించింది. టేబుల్‌పై రాసుకున్న ఆ చిన్నిమాట...తన కలను, సంకల్పాన్ని ఎప్పటికప్పుడు బలపరుస్తుండేది. 'గట్టిగా అనుకో... అయిపోద్దిలే' అని ఓ సినిమాలో అన్నట్టు, బలమైన సంకల్పం వుంటే సాధించలేనిది లేదు. 'స్ఫూర్తినిచ్చే వ్యక్తులు, స్ఫూర్తినిచ్చే దృశ్యాలు, స్ఫూర్తినిచ్చే సంఘటనలు మన చుట్టూ జరుగుతూ వుంటాయి' అని ఓ శాస్త్రవేత్త అంటాడు. మనిషి తనను తాను నిర్మించుకోడానికి, సరికొత్తగా ఆవిష్కరించుకోడానికి గట్టి సంకల్ప బలం వుండాలి.
    గట్టిగా అనుకోవడం అంటే ఒక పనిని ఎలాగైనా చేయాలని సంకల్పించుకోవడం. సంకల్పం బలంగా ఉన్నప్పుడు అది ఎంత పెద్ద కష్టమైనా... పట్టుదలతో చేస్తే నెరవేరుతుంది. అందుకే అంటారు 'మనసుంటే మార్గం వుండకపోదు' అని. కనుకనే 3వ తేదీనాటి ఉద్యోగులు, ఉపాధ్యాయుల 'చలో విజయవాడ' కార్యక్రమం విజయవంతమైంది. 'బాటలు నడచీ/ పేటలు కడచీ/ కోటలన్నిటిని దాటండి/ నదీనదాలు,/ అడవులు, కొండలు/ ఎడారులా మనకడ్డంకి?' అంటాడు మహాకవి శ్రీశ్రీ. అడుగడుగునా ప్రభుత్వ నిర్బంధం వున్నా... ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే సంకల్పం వుంది గనుకనే రకరకాల మార్గాలలో, రకరకాల వేషాలలో తమ గమ్యస్థానానికి చేరారు. కొందరు నాలుగైదు రోజుల ముందుగానే విజయవాడకు చేరుకున్నారు. 'పెళ్ళివారమండి' అంటూ బస్సులో కొందరు వస్తే... బిచ్చమెత్తుకునే వారిగా, రైతులుగా, వలస కార్మికులుగా, మానసిక వైకల్యం వున్నవారిలా నటిస్తూ... పోలీసు నిర్బంధాలను దాటుకుంటూ... లక్ష్యాన్ని చేరుకున్నారు. కార్యసిద్ధికి కావాల్సింది... సంకల్పశుద్ధి. సచివాలయ పోలీసు నుంచి డిజిపి స్థాయి అధికారి వరకు అందరి నిఘానేత్రాలను దాటుకుని సభాస్థలికి చేరుకున్న వారి సంకల్పశుద్ధి, పట్టుదల శ్లాఘనీయం... చారిత్రాత్మకం. 'నిరుత్సాహ, నిరుద్వేగ మిథ్యా జీవితమెందుకు/ గుదికాళ్ళ గాడిదలా, చల్లారిన బూడిదలా/ అచ్చమైన మనుషుల్లా నిండు బ్రతుకు బతుకుదాం' అంటాడు కారల్‌ మార్క్స్‌ ఒక కవితలో. చల్లారిన బూడిదలా కాకుండా... నిప్పుకణికల్లా ఉద్యమ కెరటాలయ్యారు.
     ఏదైనా పాలకవర్గ పార్టీల సభ జరుగుతుందంటే... ఉచిత రవాణాతోబాటు మందు, బిర్యానీ, జన సమీకరణ లేకుండా సభలు జరగవు. అలాంటిది... ఎలాంటి ఆదేశాలు లేకుండా పిఆర్సీ సాధనే తమ లక్ష్యంగా ఉద్యోగులంతా సొంత డబ్బు ఖర్చు చేసుకొని, స్వచ్ఛందంగా కదిలారు. మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులూ మేము సైతం అంటూ పిడికిలి బిగించారు. అలజడిని, ఆక్రోశాన్ని, ఆందోళననీ, కలిగించే... గుండెలను మండించే... ప్రభుత్వ జీవోలపై రణన్నినాదం చేశారు. 'నేను సైతం/ భువనభవనపు/ బావుటానై/ పైకిలేస్తాను' అన్నట్టుగా తమ న్యాయమైన కోర్కెల సాధనకు అరుణారుణమయ్యారు. 'గట్టిగా అనుకున్నారు' కాబట్టే... సభాస్థలి ఉద్యోగుల ఉప్పెనైంది. వారి ఆకాంక్షను, కోరికను, సంకల్పాన్ని ప్రభుత్వం కూడా గుర్తించాలి. విజ్ఞతను ప్రదర్శించి...ఉద్యోగుల న్యాయమైన కోర్కెల పట్ల సానుకూలత చూపాలి. అంతా ఒకే కుటుంబం అంటూనే ఉద్యోగులపై ఎస్మా ప్రయోగం వరకూ వెళ్లడం మంచిది కాదు. ఉద్యోగులకు చేసిన దాని గురించే గొప్పలు చెబుతూ... చేయాల్సిన బాధ్యతను విస్మరింప తగదు. ప్రభుత్వం అందించే సంక్షేమం, ఇతర పాలనా సౌకర్యాలు ప్రజలకు అందాలన్నా, జనం స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు సర్కారు తెలుసుకోవాలన్నా ఉద్యోగుల సేవలే కీలకం. ఉద్యోగులు రాష్ట్ర ప్రగతికి రథచక్రాలు. వాటిని సవ్యమైన దిశగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది.