కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులపై రుద్దిన వ్యవసాయ చట్టాల రద్దు కోసం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపు మేరకు సోమవారం నిర్వహించిన భారత్ బంద్ జయప్రదమైంది. రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక, ఉద్యోగ, మహిళా, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల భాగస్వామ్యాలతో బంద్ సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రజల నుండి ఎన్నడూ లేని విధంగా అపూర్వ స్పందన, మద్దతు, సంఘీభావం బంద్‌కు లభించాయి. మోడీ ప్రభుత్వ విధానాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలకు తాళలేకున్న ప్రజ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని తమ నిరసనాగ్రహాన్ని తెలియజెప్పారు. బంద్‌కు కాంగ్రెస్, లెఫ్ట్ సహా 19 బిజెపి యేతర రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మావోయిస్టు పార్టీ సైతం బంద్‌కు మద్దతుగా ప్రకటన చేసింది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అధికార ప్రభుత్వాలు మద్దతు తెలపడం బంద్ ఘనంగా విజయవంతం కావడానికి దోహదపడింది. రాష్ట్రాల అధికారాలను, ఫెడరల్ స్ఫూర్తిని కాలరాసే విధంగా ఉన్న మోడీ ప్రభుత్వ వైఖరి వలన ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సైతం బంద్ అనుకూల వైఖరి తీసుకున్నాయి. బిజెపి పాలిత గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఉత్తరాఖండ్‌లలో బంద్‌ను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు, ప్రజలు బారికేడ్లను చేధించుకొని మరీ వీధుల్లో కదం తొక్కడం విశేషం. ఈ పరిణామం బిజెపి పట్ల ప్రజల్లో గూడు కట్టుకుంటున్న ఆక్రోశానికి అద్దం పడుతుంది.
నిరుడు కరోనా విజృంభిస్తున్న వేళ ఇదే అదనుగా వ్యవసాయ పంటల మార్కెట్ కమిటీలు ఎత్తివేసే, కాంట్రాక్టు సేద్యం మరింత పాదుకొనే, నిత్యావసరాల నిల్వలపై పరిమితులు ఎత్తేసే మూడు చట్టాలను మోడీ సర్కారు ఏకపక్షంగా చేసింది. తమ ఉనికికే ముప్పు కలిగించే వినాశకర నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గతేడాది నవంబర్ 26న రైతులు ఢిల్లీ పీఠాన్ని కదిలించేందుకు పయనమయ్యారు. శివార్లలో నిలువరించగా అక్కడే బైఠాయింపు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు. దాంతో తమ ఆందోళన మొదలై పది మాసాలు పూర్తి చేసుకున్న సందర్భాన, తామెందుకు ఎండ, వాన, చలి, కరోనాలను లెక్క చేయకుండా పోరాటం చేయాల్సి వచ్చిందో దేశానికి తెలియజెప్పేందుకు 27న భారత్ బంద్‌కు నడుం కట్టారు రైతులు. ఈ నెల 5న బిజెపి పాలిత యు.పి లో గల ముజఫర్‌నగర్‌లో లక్షలాది రైతులతో 'మహా పంచాయతీ' నిర్వహించి బంద్ బావుటా చేతబూనారు. బంద్ ఆవశ్యకతను వివరిస్తూ ఊరూ వాడా సదస్సులు, సమావేశాలు, ర్యాలీలు, కరపత్రాలు, పోస్టర్లతో విస్తృత ప్రచారం చేసి మోడీ పాలనలో కడగండ్ల పాలైన వారిని సమీకరించి సన్నద్ధం చేశారు. ఇంతటి అకుంఠిత దీక్ష, కఠోర కృషి ఉన్నందునే బంద్ ఘన విజయం సార్ధకమైంది.
ఈ భారత్ బంద్‌ది ప్రత్యేక నేపథ్యం, చరిత్రాత్మకం. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఐక్య పోరాటాలు మరింత బలపడటానికి బంద్ దిశా నిర్దేశం చేసింది. కార్మిక, కర్షక ఐక్యతను పటిష్టమొనర్చింది. కార్పొరేట్ల దోపిడీని ఐక్యంగా ప్రతిఘటించాలని మార్గ దర్శనం కావించింది. కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తున్న పార్టీలు, ప్రభుత్వాలకు గట్టి హెచ్చరిక అయింది. హిందూత్వ, కార్పొరేట్ దోపిడీకి ఊతం ఇచ్చే నయా-ఉదారవాద విధానాలను కలగలిపి మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కుటిల పన్నాగాలను రైతు ఉద్యమం పటాపంచలు చేయనారంభించింది. రైతుల ఆందోళనలు కొన్ని రాష్ట్రాలకే, కొన్ని ప్రాంతాలలోనేనని తక్కువ చేసి చూస్తున్న బిజెపి కి ఒకటి కాదు రెండు కాదు 540 సంఘాల మద్దతుతో ఆసేతు హిమాచలం జనాన్ని కదిలించిన భారత్ బంద్‌తోనైనా కనువిప్పు కలిగి ఉండాలి. 'కార్పొరేట్ల కబంధ హస్తాల నుండి వ్యవసాయ పరిరక్షణ, మోడీ గద్దె దిగాలి' అనే నినాదం బంద్‌లో దేశ వ్యాప్తంగా పెక్కటిల్లింది. జాతి వ్యతిరేక, రైతు వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక సాగు చట్టాలను రద్దు చేయకపోతే ప్రజలు ఆ కార్యాచరణను నిజం చేసే రోజు ఎంతో దూరం లేదు.










