ప్రజాశక్తి- విఆర్.పురం
మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామంలో నిర్మిస్తున్న నిర్వాసిత కాలనీల్లో 2022లో కేటాయించిన ఇళ్లనే తమకు ఇవ్వాలని బాధిత నిర్వాసితులు డిమాండ్ చేశారు. తావ్వాయి నిర్వాసిత కాలనీలో తమకు కేటాయించిన ఇళ్లను చూసేందుకు సోమవారం బాధిత నిర్వాసితులు వెళ్లారు. అయితే 2022లో వారికి కేటాయించిన ఇళ్లను కాకుండా వేరే ఇళ్లను అధికారులు చూపించడంతో వారంతా అవాక్కయ్యారు. గతంలో తమకు కేటాయించి, చూపించిన ఇళ్లు వేరని, ఇప్పుడు చూపిస్తున్న ఇళ్లు వేరుగా ఉన్నాయని ఆవేదన బాధిత నిర్వాసితులు వ్యక్తం చేశారు. ఈ విషయంపై జంగారెడ్డిగూడెం తహశీల్దారును వివరణ కోరగా, విఆర్.పురం తహశీల్దారు శ్రీధర్‌ను అడగండి అని, వారు చెప్పినదే తాము చేశామని బదులిచ్చారు. దీంతో బాధిత నిర్వాసితులంతా ఆ కాలనీ వద్దే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022లో తమకు కేటాయించిన ఇంటి నెంబర్లు, ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తాము చాలా నష్టపోయామని, ఇంత త్యాగం చేసిన తమను ప్రభుత్వం, అధికారులు మోసం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వానికి నిర్వాసితులంటే చులకనగా ఉందని, ఇంకెంతకాలం మోసం చేస్తుందని ప్రశ్నించారు. తమ నిర్వాసిత కాలనీల వద్ద ఉపాధి కల్పించడానికి కంపెనీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె.సత్యనారాయణ, బాబూరావు, శివ, అధిక సంఖ్యలో బాధిత నిర్వాసితులు పాల్గొన్నారు.










