ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి పండగను అక్టోబరు 30,31 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. అమ్మవారి ఉత్సవాల నిర్వహణపై కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతం కంటే మిన్నగా ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని, గతంలో చోటుచేసుకున్న చిన్నచిన్న లోపాలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఏడాది కూడా విజయనగరం ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఈనెల 29న వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆలయ కమిటీ ప్రతినిధులు, జీవితకాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, వారందరి అభిప్రాయాలను తెలుసుకొని, ఉత్సవ నిర్వహణకు ఒక ప్రణాళికను తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణకు చుట్టు పక్కల జిల్లాలనుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు తరలివస్తారని, వారందరినీ దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఆమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే ఆలయం తూర్పువైపు షాపులను తొలగించామని, ఉత్సవాలకు ముందే పశ్చిమవైపు కూడా తొలగిస్తామని చెప్పారు. గత ఏడాది సిరిమానోత్సవం కొద్దిగా ఆలస్యం అయ్యిందని, ఈ సారి అది జరగకుండా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిరిమానోత్సవం అనంతరం కోట వద్ద పులివేషాల పోటీ, రాజీవ్ స్టేడియంలో బాణాసంచా కాల్చడం జరుగుతుందని చెప్పారు. వీలైనంత వరకు సోమవారం నాటికే విఐపిల దర్శనాలు పూర్తి చేసుకుంటే, మంగళవారం నాడు ఇబ్బందులు ఉండవన్నారు. ఈ ఏడాది కూడా విఐపి పాస్‌లను రద్దు చేయాలని, సామాన్య భక్తులు దర్శనానికి ఇబ్బంది పడకుండా చూడాలని కోలగట్ల కోరారు.
జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విఐపిల దర్శనాల సమయంలో కూడా సామాన్య భక్తుల దర్శనాలు కొనసాగేలా చూడాలని కోరారు. సిరిమానును తీసుకువచ్చి, సిద్దం చేసే ప్రక్రియలో అన్ని శాఖల మధ్యా సమన్వయం ఉండాలని, జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడి, ఉత్సవ ఏర్పాట్లను వివరించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్‌పి దీపిక, ఎంఎల్‌సి ఇందుకూరి రఘురాజు, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యుటీమేయర్ లయా యాదవ్, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, పైడితల్లి అమ్మవారి ఆలయ ఇఓ సుధారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










