ఆలోచనలు ఇనుప గునపాలై
మెదడు పొరల్ని చీలుస్తూ ఉంటే
గతం తాలూకు ఆనవాళ్లు పదే పదే
జీవితాన్ని శాసిస్తూ ఉంటే
బతుకు ఓ చరిత్ర పుస్తకంలోని
ఎప్పటికీ మారని పాఠంలా మిగిలిపోతుంది
జ్ఞాపకాల దొంతరల నడుమ
బయటపడ్డ గతం తాలూకు ఆనవాళ్లు
వర్తమానానికి కళ్లం వేస్తే
జీవితం గుడ్డి గుర్రంలా పరిగెత్తడం మరిచిపోయి
భవిష్యత్తు కనుచూపు మేరలో
కాళ్లకు కనిపించకుండాపోతోంది
మెదడు పుట్టలో నిద్రపోతున్న
జ్ఞాపకాల సరీసృపాలను తట్టిలేపితే
పడగలెత్తిన వర్తమానం వెంటపడితే
బతుకంతా భయంతో అడుగులు
ముందుకు పడక అంగవికలుడిగా
జీవితాన్ని కుంటుకుంటూ కొనసాగించాలి
జ్ఞాపకాల శిధిలాల కింద
గతం తాలూకు దుఃఖాన్ని పూడ్చి పెడదాం
మనోధైర్యం చూపిన రహదారిలో
వర్తమానానికి నడకలు నేర్పిద్దాం
కలల దారాలతో అల్లిన గూళ్లలో
భవిష్యత్తును భద్రంగా దాచుకుందాం
ఈదర శ్రీనివాసరెడ్డి
78931 11985