May 20,2023 01:01
మాట్లాడుతున్న మోపిదేవి

ప్రజాశక్తి-రేపల్లె: ప్రభుత్వం నిరుపేదలకు ఇస్తున్న సెంటు భూములు సమాధులు కట్టుకోవటానికి కూడా సరిపోవని ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించటం పేదలను అవమానించటమేనని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా అర్హత ఉన్న ప్రతి పేదవానికి కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాలనే ఆశయంతో పని చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తూ టిడిపి నాయకులు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సెంటు భూమి కూడా లేని నిరుపేదలు ఎందరో కాల్వ గట్లపైన, రోడ్డు మార్జీన్లలో నివాసం ఉంటున్నరని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేని వారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం విజయం సాధిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణమూర్తి, చైర్‌ పర్సన్‌ కట్టా మంగ, వైస్‌ చైర్మన్‌ తునుగుంట్ల కాశీ విశ్వనాథ గుప్త తదితరులు పాల్గొన్నారు.