Nov 06,2023 21:01

కొంకివీధిలో అక్రమంగా నిర్మాణమవుతున్న వాణిజ్య సముదాయం

సాలూరు: మున్సిపాలిటీ లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు సాగిపోతున్న పరిస్థితి నెలకొంది. పట్టించుకునే నాధుడు లేకపోవడంతో పట్టణ ప్రణాళిక విభాగం గాడి తప్పింది. ఏడాదికి పైగా టిపిఒ పోస్ట్‌ ఖాళీగా ఉంది. ఇక్కడికి పని చేయడానికి అధికారులు ముందుకు రావడం లేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా అభివృద్ధి చెందిన పట్టణాలు, నగరాల్లో పని చేస్తున్న అధికారులు ఇక్కడ పని చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పట్టణంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఇప్పుడిప్పుడే మొగ్గతొడిగిన దశలో ఉంది. మిగిలిన మున్సిపాలిటీల్లో నాలుగు రాళ్లు వెనకేసుకోడానికి అలవాటు పడిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఈ మున్సిపాలిటీలో పని చేయడానికి ముందుకు రావడం లేదు. గతంలో విశాఖ జివిఎంసిలో పని చేసిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి కొద్దినెలల్లో బదిలీ చేయించుకుని వెళ్లి పోయారు. ఆ తర్వాత నుంచి ఇక్కడికి ఎవరూ రావడం లేదు. బొబ్బిలి మున్సిపాలిటీ టిపిఒకు కొన్నాళ్ల క్రితం ఇక్కడ టిపిఒగా ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన కనీసం వారం రోజులు కూడా ఇక్కడికి రాకుండానే ముఖం చాటేశారు. ఆయనకు ప్రస్తుత మున్సిపల్‌ కమిషనర్‌ టి.జయరాం నోటీసు జారీ చేశారు. ఇన్‌ఛార్జి టిపిఒ గా వారంలో మూడు రోజులు ఈ మున్సిపాలిటీలో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయినా ఆయన బేఖాతరు చేశారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారి లేకపోవడంతో ఆ విభాగంలో ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా తయారైంది. దీంతో కొంతమంది అక్రమ నిర్మాణాలు సాగిస్తున్న వ్యాపారులు దళారులను ఆశ్రయిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసిన తర్వాత మార్గదర్శకాల ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పలుకుబడి, డబ్బులు ఉన్న వారికి నామమాత్రంగా నోటీసు జారీ చేసినట్లు చూపిస్తూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
గృహ నిర్మాణాల ముసుగులో వాణిజ్య సముదాయాలు
పట్టణంలో చాలా ప్రాంతాల్లో కొంతమంది నిర్మాణదారులు గృహ నిర్మాణం కోసమని దరఖాస్తు చేస్తున్నారు. క్రమేణా వాటిని వాణిజ్య సముదాయాలుగా మారుస్తున్నారు. ఇలాంటి నిర్మాణాల విషయంలో అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని మున్సిపాలిటీకి అపరాధ రుసుం రూపంలో ఆదాయాన్ని రాబట్టాల్సి వుంది. కానీ అధికారులు ఎక్కడా ఆ విధంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని కొంకివీధిలో మెయిన్‌ రోడ్‌లో వ్యాపారి రవ్వా సతీష్‌ భవన నిర్మాణం చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ భవన నిర్మాణం వుందనే టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది, దాని యజమాని సతీష్‌కు నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే తనకు ఏవిధమైన నోటీసులు అందలేదని ఆయన చెపుతున్నారు. దీనిపై సంబంధించిన సచివాలయ సిబ్బందికి అడగ్గా వారు కూడా సరైన వివరణ ఇవ్వలేకపొతున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇరుకు సందులో వాణిజ్య సముదాయం నిర్మాణం జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. పట్టణంలో అనేక చోట్ల ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి లేకపోవడంతో ఆ విభాగంలో జరుగుతున్న వ్యవహారాలన్నీ దళారీల కనుసన్నల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
టిపిఒ నియమించాలని లేఖలు రాశా : టి.జయరాం, కమిషనర్‌
టౌన్‌ ప్లానింగ్‌ అధికారిని నియమించాలని కోరుతూ మున్సిపల్‌ ఉన్నతాధికారులకు రెండు లేఖలు రాశా. నేను విధుల్లో చేరి 40రోజులే అయింది. టౌన్‌ ప్లానింగ్‌పై ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. నా దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకుంటాను.