Jun 28,2023 20:16

చిప్పగిరి జగనన్న కాలనీలోని గృహాలను పరిశీలిస్తున్న ఎంపిపి జూటూరు హేమలత, సర్పంచి గోవిందరాజులు

ప్రజాశక్తి - చిప్పగిరి
చిప్పగిరిలోని జగనన్న కాలనీలో థర్డ్‌ పార్టీ నిర్మిస్తున్న గృహాల్లో నాణ్యత లోపించకుండా చూడాలని ఎంపిపి జూటూరు హేమలత మారయ్య పేర్కొన్నారు. బుధవారం చిప్పగిరి సర్పంచి దాసరి గోవిందరాజులుతో కలిసి జగనన్న కాలనీలో నిర్మాణాలు పరిశీలించి నిర్మాణాల్లో అవకతవకలను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తక్కువ పునాదుల కొలతలు, 20 ఎంఎం కంకరకు బదులుగా చిప్స్‌ వాడడం ఏమిటని ఇన్‌ఛార్జీ ఎఇ భవ్యను ప్రశ్నించారు. ఇలా నిర్మాణాలు చేపడితే సంవత్సరం దాటకముందే కూలిపోతాయన్నారు. దగ్గరుండి చూసుకోవాల్సిన అధికారులు పని ప్రదేశంలో లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాగే నిర్మాణాలు జరిగితే తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. నిర్మాణాలు నాణ్యతగా ఉండే విధంగా చేపట్టాలని లబ్ధిదారులు తమ దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. కొన్ని గృహాలకు సిమెంట్‌, ఇటుకలు కూడా నాసిరకంగా వాడినట్లు పేర్కొన్నారు. కనీసం కొంతవరకైనా నాణ్యత ఉండాలని సూచించారు. అనంతరం సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, ఇన్‌ఛార్జీ ఎఇ భవ్య మాట్లాడారు. తాను పని ప్రదేశంలో లేనందువల్ల 20 ఎంఎం కంకరకు బదులుగా చిప్స్‌ వేశారని తెలిపారు. వెంటనే తీసివేసి కంకర వేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. విషయంపై విలేకరులు ప్రశ్నిస్తూ... నాణ్యత ఉండే విధంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారిగా మీపై ఉందని తెలిపారు. పని ప్రదేశంలో లేనప్పుడు ఈ విధంగా జరిగిందని, కచ్చితంగా నాణ్యత ఉండే విధంగా నిర్మాణాలు జరిగేందుకు చర్యలు తీసుకుంటామని ఎఇ తెలిపారు.