ప్రజాశక్తి-నర్సీపట్నంరూరల్:మండలంలోని ధర్మ సాగరం గ్రామంలో జగనన్న కాలనీ పనులను శనివారం నర్సీపట్నం ఆర్డిఓ జయరాం పరిశీలించారు. సర్పంచ్ కన్నయ్య నాయుడుతో మాట్లాడుతూ.. గృహాల నిర్మాణంలో ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకు రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి
నక్కపల్లి:గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీడీవో సీతారామరాజు, ఈఓపిఆర్ డి వెంకటనారాయణ సూచించారు. మండలంలోని చినతీనార్ల గ్రామంలో శనివారం జగనన్న లేఅవుట్ ను సందర్శించారు. నిర్మాణ దశలో ఉన్న గృహాలను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరితగతిన గృహ నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఇంకా గృహ నిర్మాణ పనులను ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే పనులు చేపట్టాలన్నారు. పేమెంట్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. లే అవుట్ లలో అన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ రాజు, ఎలక్ట్రికల్ ఏఈ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి, వర్క్ ఇన్స్పెక్టర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.
కోటవురట్ల:జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని మండలం ప్రత్యేక అధికారి ఉదయశ్రీ సూచించారు. పి.కొత్తపల్లి, రామన్నపాలెం గ్రామాలలో నిర్మిస్తున్న కాలనీలను ఆమె సందర్శించారు. మండల కేంద్రంలోని సమావేశం మందిరంలో అధికారులతో మాట్లాడుతూ, రానున్న వేసవిలో తాగునీటి సమస్య లేకుండా గ్రామాల్లో చర్యలు చేపట్టాలని సూచించారు.
అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, పిఆర్ ఇంజనీరు వర్మ, హౌసింగ్ ఇంజనీర్ జగదీశ్వరరావు, పిఓపిఆర్డి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










