ప్రజాశక్తి-డుంబ్రిగుడ: లబ్ధిదారులకు ఇంటి స్థలాలు కేటాయించాలని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. మండలంలోని సొవ్వా పంచాయతీ కమలబంద గ్రామంలో గిరిజన సంఘం నాయకులు పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల పట్టాలను చూపిస్తూ గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవరత్నాల పధకం పేరుతో పేదలందరికీ గృహాలు నిర్మించి ఇస్తామని ప్రకటించి, నేటివరకు ఇంటి స్థలాలు కేటాయించ లేదన్నారు. పట్టాలిచ్చి స్థలాలు కేటాయించ పోవడం దుర్మార్గమన్నారు. ఒక్క వైపు పేదలందరికి ఉచితంగా గృహాలు నిర్మిస్తామని గొప్పలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం హామీలు ప్రకటనలకే పరిమితం అయ్యిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పట్టాలు పంపిణి చేసిన లబ్దిదారులకు ఇంటి స్థలాలు కేటాయించి గృహా నిర్మాణాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి మత్తు, జయదేవ్, బంగర్రయ్య, లబ్దిదారులు పాల్గొన్నారు.










