ప్రజాశక్తి పాయకరావుపేట:గృహ సారధులు కష్టించి పని చేయాలని శాసనసభ్యులు గొల్ల బాబురావు పిలుపునిచ్చారు. స్థానిక రఘుపతి ఫంక్షన్ హాల్‌లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైయస్సార్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం వచ్చే నెల 18వ తేదీ నుండి ప్రారంభం కానుందన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెయిన్ విస్తరణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళతామన్నారు. ఒక సచివాలయ పరిధిలో ముగ్గురు కన్వీనర్లు ఉంటారని, 50 కుటుంబాలకు ఒక కన్వీనర్, ఇద్దరు గృహసారథులు ఉంటారని ఇద్దరిలో ఒకరు మహిళ ఉండాలన్నారు. గృహ సారథులు 15 రోజుల వ్యవధిలో అన్ని కుటుంబాలను కలుసుకోవాలని సూచించారు. గృహసారథులు ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను తెలియజేయాలని అన్నారు. పార్టీ సమావేశాలకు వీరు ఆహ్వానితులుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లంక సూరిబాబు, ఎంపీపీ ఇసరపు పార్వతి తాతారావు, మండల అధ్యక్షులు దనిశెట్టి బాబురావు, పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా, సర్పంచ్ గారా ఉషశ్రీ ప్రసాద్, ఉప సర్పంచ్ జగతా భవాని శ్రీను, సర్పంచ్ పడాల సోమన్న దోర, నాయకులు చోడిపల్లి శ్రీను, అశోక్ చక్రవర్తి పాల్గొన్నారు.










