
ప్రజాశక్తి -కోటవురట్ల: గృహ నిర్మాణాల వేగ వంతానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మండల ప్రత్యేక అధికారి అరుణశ్రీ సూచించారు. శుక్రవారం కోటవురట్ల మహాలక్ష్మి అమ్మవారి ఆలయ వద్ద నిర్మిస్తున్న కాలనీ ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందజేయడంతో పాటు మెటీరియల్ సమకూర్చాలని ఆమె తెలిపారు. విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం అధికారులతో మండల పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు, ఏఓ చంద్రశేఖర్, సర్పంచ్ అనిల్ కుమార్, ఈఓపిఆర్‌డి సుబ్రహ్మణ్యం, కార్యదర్శులు, సచివాలయ ఇంజనీర్లు పాల్గొన్నారు.
మాడుగుల:మండల కేంద్రంలోని జగనన్న లే అవుట్ వద్ద శుక్రవారం హౌసింగ్ డే నిర్వహించారు. రామచంద్రపురం వద్ద రెండు లే అవుట్‌ల లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఇప్పటికే దాదాపు ఇళ్ళు పూర్తికాగా, మిగిలినవి సైతం పూర్తి చేయమని అధికారులు కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మీనా కుమారి, హౌసింగ్ ఏఇ లెక్కల సత్యనారాయణ పాల్గొన్నారు.