Mar 14,2023 23:49
అధికారులతో సమీక్షిస్తున్న జెడ్పి సీఈఓ జయమోహన్‌

ప్రజాశక్తి-భట్టిప్రోలు: నియోజకవర్గంలోని జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఉమ్మడి గుంటూరు జిల్లా సీఈఓ జయమోహన్‌ సూచించారు. భట్టిప్రోలు మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన సాధారణ తనిఖీలలో భాగంగా మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు మండలంలో గృహ నిర్మాణాలు ప్రోగ్రెస్‌ తక్కువగా ఉందన్నారు. స్థలాలు మాగాణి భూములు కావటం వలన ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అనుకూలించలేదన్నారు. వేసవికాలం రావటంతో లబ్ధిదారులతో మాట్లాడి వారికి అవగాహన కల్పించి నిర్మాణాలు చేపట్టే విధంగా చూడాలన్నారు. అలాగే వేసవి దృష్ట్యా తాగునీటికి సమస్య రాకుండా చూడాలని, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి తాగునీటిపై సమీక్షించాలని, ఎంపిడిఒను ఆదేశించారు. అనంతరం సీఈఓను అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి టి ఉదరు భాస్కరి, ఎంపిడిఓ చంద్రశేఖర్‌, ఈఒపిఆర్‌డి శేఖర్‌ బాబు, హౌసింగ్‌ ఏఈ రావురు సౌమ్య రేవతి, పిఆర్‌ ఏఈ రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.