Apr 25,2023 00:37

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కృతికా శుక్లా

ప్రజాశక్తి - కాకినాడ
ప్రస్తుత వాతావరణం అనువుగా ఉన్నందువల్ల గృహ నిర్మాణ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కాకినాడ అర్బన్‌ పరిధిలో హౌసింగ్‌ నిర్మాణాల పురోగతిపై కలెక్టర్‌ కతికా శుక్లా కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్‌ ఆర్‌. మహేష్‌ కుమార్‌, హౌసింగ్‌, డిఆర్‌డిఎ, మెప్మా, విద్యుత్‌, ఆర్డబ్ల్యూఎస్‌ శాఖలతో కలిసి సమీక్షించారు. కొమరగిరి, నేమాం-4, పండూరు, ఏపీ.త్రయం జగనన్న కాలనీలలో జరుగుతున్న గృహ నిర్మాణాల దశల వారీ పురోగతిని, ఎస్‌.హెచ్‌.జీ రుణాలు మంజూరు, తాగు నీరు, విద్యుత్‌, రహదారులు వంటి సౌకర్యాల కల్పన అంశాలపై కలెక్టరు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో కాకినాడ పట్టణంలో మంజూరైన ప్రతి గృహాన్ని గడువు లోగా పూర్తి చేయాలన్నారు. ఎంఒయు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు వెంటనే ఎస్‌.హెచ్‌.జీ రుణాలు మంజూరు చేసి, నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగేవిధంగా చూడాలన్నారు. ఎస్‌.హెచ్‌.జీ రుణాల మంజూరుపై డిఆర్‌డిఎ, మెప్మా అధికారులు మరింత దృష్టి పెట్టి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. పట్టా పొందిన ప్రతి ఒక్కరూ నిర్మాణం చేపట్టి పూర్తి చేయడంతో పాటు, జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.
సమావేశంలో హౌసింగ్‌ పీడీ బి.సుధాకర్‌ పట్నాయక్‌, ఎడిసి సీహెచ్‌.నాగ నరసింహారావు, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, మెప్మా పీడీ బి.ప్రియంవద, ఎపిఈపిడిసిఎల్‌ ఇఇ ప్రసాద్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ ఎం.శ్రీనివాస్‌, కాకినాడ, పెద్దాపురం డిఎల్‌డిఒలు, ఇతర ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.