Oct 28,2023 22:26

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: నగరపాలక సంస్థ పరిధిలోని జగనన్న హౌసింగ్‌ కాలనీల్లో గృహనిర్మాణ లక్ష్యాలను పూర్తిచేయాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ సంబంధింత అధికారులను ఆదేశించారు. శనివారం నగరపాలక కార్యాలయంలో హౌసింగ్‌ అధికారులు, నోడల్‌ ఆఫీసర్లు, వార్డు అడ్మిన్‌, అమినిటీ కార్యదర్శులతో కమిషనర్‌ సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ... హౌసింగ్‌ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని, నవంబర్‌ నెలలో పూర్తి చేయాల్సిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ఆమేరకు రోజువారి పనులు జరిగేలా పర్యవేక్షించాలన్నారు. వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు, నోడల్‌ అధికారులు, హౌసింగ్‌ అధికారులు సమన్వయంతో పనిచేసి హౌసింగ్‌ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా పనులు ప్రారంభించి నిలిపివేసిన లబ్ధిదారులను గుర్తించి, వారికిఅవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించాలన్నారు. వార్డు సచివాలయం స్థాయిలో ఉదయం నీటి సరఫరా తీరు, సాయంత్రం వీధిలైట్ల నిర్వహణ కచ్చితంగా పరిశీలించి రోజువారి వివరాలు సమర్పించాలన్నారు. కన్సిస్టంట్‌ రిథమ్‌ యాప్‌, జగనన్న ఆరోగ్య సురక్ష, పౌర సేవలు, పన్నుల వసూలు, నిర్దేశించిన రోజువారి విధి నిర్వహణాలపై కమిషనర్‌ సమీక్ష నిర్వహించారు. ఈకార్యక్రమంలో హౌసింగ్‌ డీఈ గురురాజన్‌, ఏఈ శ్రీధర్‌, సీఎంఎం గోపి, ఏసిపీ రామకృష్ణుడు, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ లోకేష్‌, డీఈ రమణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.