Jun 03,2023 00:15
గృహ నిర్మాణాలు, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జగనన్న కాలనీలలోని పక్కా గృహ నిర్మాణాలలో పురోగతి సాధనకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా ఆదేశించారు. గృహ నిర్మాణాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలపై డివిజన్‌, మండల, గ్రామ సచివాలయాల స్థాయి అధికారులతో శుక్రవారం ఆయన వీక్షణ సమావేశం ద్వారా సమీక్షించారు. పక్కా గృహాలు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు తక్షణమే బిల్లులను చెల్లించాలని కలెక్టర్‌ తెలిపారు. పునాది దిగువన ఉన్న గృహాలు పునాది దశకు, పునాది దశలోవి, రూఫ్‌ దశకు రూఫ్‌లో ఉన్నవి, శ్లాబ్‌ దశలో ఉన్న గృహాలు జూలై నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అధికారులకు వ్యక్తిగతంగా నిర్దేశించిన లక్ష్యాలు రెండు వారాలలో తప్పనిసరిగా చేరుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులతో ఆర్‌డిఒలు ప్రతిరోజూ సమావేశాలతో సమక్షించుకోవాలన్నారు. సొంత స్థలాలకు మంజూరైన గృహాలు ఇప్పటి వరకు నిర్మించుకోకపోతే వాటిని రద్దు చేసి ఇతరులకు కేటాయించాలన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు సమావేశానికి గైర్హాజరైతే వారికి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయాలన్నారు. గృహ నిర్మాణాలలో పురోగతి సాధించలేకపోతున్న సచివాలయాల ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ తెలిపారు. పురోగతి ఆధారంగా ప్రతి 15 రోజులకు వారి పనితీరును ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. ప్రతి నెలలో జిల్లాలో కనీసం రెండు వేల గృహాల నిర్మాణం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పిఎంఏవై గ్రామీణ్‌ పథకం కింద 16,000 గృహాలు లక్ష్యం కాగా ప్రస్తుతం 7,000 గృహాల నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు. 2,000 గృహాల నిర్మాణాలు జరిగేలా చూడాలని, పురోగతిలో ఉన్నవి త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కొరిశపాడు, కొల్లూరు, మార్టూరు, చెరుకుపల్లి, వేమూరు, చినగంజాం మండలాల్లో తక్కువగా ఉన్న పురోగతిని పెంచాలన్నారు. జల జీవన్‌ మిషన్‌ పనులకు సంబంధించిన బిల్లులు రెండు వారాల్లో బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌, అమృత్‌ సరోవర్‌, జగనన్న శాశ్వత భూ హక్కు, రీ సర్వే పనుల పురోగతి కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. జగనన్న లే అవుట్‌లను మండల ప్రత్యేక అధికారులు ప్రతి శనివారం విధిగా పరిశీలించాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ సిహెచ్‌ శ్రీధర్‌ ఆదేశించారు. జిల్లాలో 5,957 మందికి తహశీల్దారు పొజిషన్‌ సర్టిఫికెట్స్‌ ఇవ్వాలన్నారు. వర్షాలు కురియక ముందే గృహ నిర్మాణాలలో పురోగతి వచ్చేలా చూడాలని సూచించారు. వీక్షణ సమావేశంలో డిఆర్‌వో కె లక్ష్మీశివజ్యోతి, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.