ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలు జగనన్న కాలనీ లే ఔట్‌లో ఇప్పటివరకు గృహ నిర్మాణాలు పురోగతిని ఎందుకు సాధించలేదని జిల్లా జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు మండల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1100 మందికి స్థలాలు ఇస్తే కేవలం 100 మంది మాత్రమే గృహాలు నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు పని చేస్తున్నారా లేదా అంటూ సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. 'నీళ్లు లేకుండా గృహ నిర్మాణం ఎలా?' అనే శీర్షికన ప్రజాశక్తి దినపత్రికలో శుక్రవారం ప్రచురించబడిన కథనానికి స్పందించిన జెసి శ్రీనివాసులు భట్టిప్రోలు లేఅవుట్‌ను శనివారం పరిశీలించారు. కనీస వసతులు లేకుండా గృహాలు ఎలా నిర్మించుకోవాలని లబ్ధిదారులు జేసీ ఎదుట వాపోయారు. కనీసం నీళ్లు కూడా అందుబాటులో లేవని, డ్రమ్ము నీళ్లు వంద రూపాయల చొప్పున కొనుగోలు చేసి కట్టుబడి చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేదు. రహదారులు లేవు. వర్షాలు వస్తే మూడు అడుగుల లోతు నీళ్లు నిలబడతున్నాయని తమ గోడు వెళ్లబోసుకున్నారు. గృహాలు నిర్మిస్తే ప్రభుత్వమే మెరకలు తోలిస్తామని గత ఏడాది చెప్పటంతో బేస్‌మెంట్ వేసుకున్నా మని, కాని మెరకలు మాత్రం తోలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపు లైను ఏర్పాటుకు కాంట్రాక్టు తీసుకున్న జెడ్పిటిసి పని చేయకపోతే అధికారులు ఏమి చేస్తున్నారని జెసి ప్రశ్నించారు. రెండు రోజులలో పైపులైను పనులు పూర్తిచేసి గృహ నిర్మాణాలకు నీటి వసతి కల్పించాలని, లేకుంటే సంబంధిత ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఇంటికి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. రహదారులు, విద్యుత్ సౌకర్యాలు త్వరలో పూర్తి చేస్తామని హామీనిచ్చారు.
దిగువ స్థాయి అధికారులకు మెమో జారీపై చర్చ
జగనన్న కాలనీలో వసతులు కల్పనలో విఫలం చెందిన అధికారులకు మెమోలు జారీ చేస్తామని శనివారం జెసి చేసిన వ్యాఖ్యలకు మండల అధికారులు ఖంగుతిన్నారు. దీనిని సాకుగా చూపి దిగువ స్థాయి సిబ్బందికి మెమోలు జారీ చేయాలని యోచించటం సరికాదని వారు పేర్కొంటున్నారు. నీటి సమస్య పరిష్కరించాల్సిన మండల అధికారులు అందుకు కారకులైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకుండా తమపై విరుసుకుపడితే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.
కనీస ఏర్పాట్లు లేక ఇబ్బంది పడ్డ జాయింట్ కలెక్టర్
జాయింట్ కలెక్టర్ వస్తున్నారన్న సమాచారం ముందుగానే ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు లేఅవుట్‌లో కనీస ఏర్పాట్లు చేయకపోవటం పట్ల జెసి అసహనానికి గురయ్యారు. మండుటెండలో కూర్చోవడానికి కుర్చీ, లబ్ధిదారులతో మాట్లాడటానికి టెంటు కూడా ఏర్పాటు చేయకపోవటంతో వచ్చిన పావుగంటకే జెసి వెనుదిరిగారు. తమ సమస్యలు పూర్తి స్థాయిలో చెప్పుకోవడానికి కూడా సమయం చాలలేదని అధికారుల తీరు పట్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి డివి లలితకుమారి, జెడ్పిటిసి ఉదరు భాస్కరి, ఎంపిడిఒ చంద్రశేఖర్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, సర్పంచ్ దారా రవికిరణ్మయి, హౌసింగ్ ఏఈ ప్రసన్న, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.










