Aug 16,2023 22:22

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : గృహ నిర్మాణంలో కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ అరుణ్‌ బాబు, ప్రత్యేక అధికారి వెంకటరామిరెడ్డి హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణాలపై ఆ శాఖ ఉన్నత అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి వెంకటరామిరెడ్డి, జిల్లా హౌసింగ్‌ పీడీ ి చంద్రమౌళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 10 వేల ఇళ్లు పూర్తి కావాలని ముఖ్యమంత్రి గత ఏడాది ఆదేశించారన్నారు. 11 వేలకు పైగా ఇళ్లు పూర్తిచేసి 100 శాతం పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారన్నారు. ఈ ఏడాది 15,451 ఇళ్ల నిర్మానం లక్ష్యంగా కేటాయించగా 92 శాతం పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలోనే గృహ నిర్మాణాల్లో జిల్లా ముందంజలో ఉంటుందన్నారు. ఇళ్ల నిర్మాణం సకాలంలో నాణ్యత తో పూర్తిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ఈ తొమ్మిది రోజుల్లో లక్ష్యాన్ని అధిగమించాలని కోరారు.1348 గృహాలు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయని వాటి పురోగతికి అధికారులు కష్టపడి పని చేయాలన్నారు. గోరంట్ల మండలం మల్లపల్లిలోని జగనన్న కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని పీడీని కలెక్టర్‌ ఆదేశించారు. ఆ కాలనీకి ప్రత్యేక డిఇని నియమించి త్వరగతిన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్‌ ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ రషీద్‌ ఖాన్‌, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, ద్వామా పీడీ రామాంజనేయులు, గ్రామ సచివాలయాల నోడల్‌ అధికారి శివారెడ్డి, విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ మోసెస్‌ తదితరులు పాల్గొన్నారు.