* పేదల సొంతింటి కల సాకారం
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - జలుమూరు: జిల్లాలో 32,600 గృహ నిర్మాణాలతో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. జిల్లాస్థాయి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని మండలంలోని లింగాలవలస జగనన్న కాలనీలో గురువారం నిర్వహించారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి సందేశాన్ని తెరపై వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాల నిమిత్తం 1,79,690 ఎకరాలు అవసరం కాగా 1,22,717 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి, మిగతా 508.63 ఎకరాల మేరకు ప్రైవేటు భూమిని కొనుగోలు చేశామన్నారు. ఒక్క భూమి కోనుగోలు కోసమే రూ.178.31 కోట్లు వెచ్చించి జిల్లాలో 1.20 లక్షల మందికి పట్టాలు ఇచ్చామన్నారు. జిల్లాలో సుమారు 700 లేఅవుట్లలో తాగునీటి సౌకర్యం, రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్ వంటి పనులు చురుగ్గా చేపడుతున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేద ప్రజల సొంతింటి కల నేడు సాకారమైందన్నారు. సరైన గృహ వసతి లేక ఇబ్బందులు పడుతున్న పేదలు గౌరవప్రదంగా జీవించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని ఆనందం వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న గృహాలను త్వరితగతిన పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయాలన్నారు.
ఇళ్లు కాదు ఊళ్లు
ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఎవరూ ఉండకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే ఏకంగా 30.75 లక్షల ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కింద శరవేగంగా 21.76 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఆనాటి రెవెన్యూ మంత్రిగా తన చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేసే అవకాశం తనకు లభించిందన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అని అన్నారు. అనంతరం కాలనీ నిర్మాణానికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, హౌసింగ్ పీడీ ఎం.గణపతిరావు, డిసిసిబి చైర్మన్ కె.రాజేశ్వరరావు, వైసిపి నాయకులు ధర్మాన రామ్ మనోహర్‌నాయుడు, ఎంపిపి వాన గోపి, వైస్ ఎంపిపి తంగి మురళీకృష్ణ, మండల సలహాదారుడు పైడి విఠల్‌రావు, తహశీల్దార్ బి.సత్యం, ఎంపిడిఒ ఎల్.వి అప్పారావు, వైసిపి మండల అధ్యక్షులు కె.సీతారాం, జెసిఎస్ కన్వీనర్ ధర్మాన జగన్మోహనరావు, పలువురు నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.










