Feb 19,2023 00:33
మాట్లాడుతున్న కమిషనర్‌

ప్రజాశక్తి-బాపట్ల: జగనన్న కాలనీలో నిర్మాణ దశలో నిలిచిపోయిన లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించి గృహ నిర్మాణాలు పూర్తిచేయాలని బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌ భాను ప్రతాప్‌ వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శనివారం బాపట్ల మూలపాలెం, ప్యాడిసన్‌ పేట జగనన్న కాలనీల్లో వార్డు సిబ్బంది లబ్ధిదారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా భాను ప్రతాప్‌ మాట్లాడుతూ జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ప్యాడిసన్‌ పేట, బేతనీ కాలనీ, మూలపాలెం జగనన్న లేఔట్లలో 3 వేల 5వందల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసిన నివేశన స్థలాల్లో వెయ్యి గృహ నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు జరిగాయి. మరో 3 వందల గృహాలు బేస్‌మట్టం వరకే పరిమితమయ్యాయి. అధిక శాతం పునాది, బేస్‌ మట్టం వరకే ఉన్న గృహ నిర్మాణాలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించి రానున్న ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో గృహ నిర్మాణాలు పూర్తయ్యే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్న కాలనీలో తాగునీరు, రహదారుల నిర్మాణం పనులు వేగవంతం చేసేందుకు జాతీయ రహదారి 216 రోడ్డు విస్తరణలో భాగంగా త్రవ్వకాల్లో తొలగించిన మట్టిని జగనన్న కాలనీల్లో రహదారులు నిర్మాణానికి వినియోగిస్తున్నట్లు అని తెలిపారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పనకు అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గృహ నిర్మాణాలు అవసరమైన నీరు, ఇసుక, సిమెంట్‌ వంటివి సకాలంలో లబ్ధిదారులకు ఎదుర్కోకుండా చూడాలన్నారు. జగనన్న కాలనీలో పరిశీలించిన వారిలో మున్సిపల్‌ డిఈ శ్రీనివాసులు, వార్డు సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.