టౌన్‌లెవల్ బ్యాంకర్స్ మీటింగ్‌లో విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
ప్రజాశక్తి-విజయవాడ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన అందరికీ జగనన్న ఇంటి సదుపాయంతో పాటు టిడ్కో గృహాల నిర్మాణాలకు అవసరమైన రుణ సదుపాయాన్ని బ్యాంకర్స్ కల్పించి, పథకం విజయవంతం అయ్యే విధంగా సహకరించాలని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. విఎంసిలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో టౌన్ లెవల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగింది. నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎన్‌టిఆర్ జిల్లా ఎల్‌డిఎం పి కోటేశ్వరరావు, పలువురు బ్యాంక్ మేనేజర్స్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో మేయర్ మాట్లాడారు . రుణ మంజూరులో చిన్ని చిన్న లోపాలు ఎదురయినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా కొంత వరకు నిబంధనలు సడలించి గృహ నిర్మాణాలు పూర్తి చేసేందుకు రుణ సదుపాయం కల్పించి, హౌసింగ్ స్కీమ్ పూర్తి అయ్యేందుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గృహాలతో పాటు వివిధ దశల్లో ఉన్న గృహాలన్నీ పూర్తి కావడానికి రుణ సదుపాయం ఎంతో కీలకంగా ఉన్నందున దానిని సాధ్యమైన మేరకు మావవతా దృక్పధంతో బ్యాంకర్లు ఆలోచించి, నిర్ణయం చేయాలన్నారు. కమిషనర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ పథకం ఎంతో ముఖ్యమైనం దున, ఎక్కడా ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా రుణ సదుపాయం కల్పించినట్లయితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరు తుందని, అందుకు ప్రతి బ్యాంక్ మేనేజర్ సహకరించాల్సి ఉంటుందన్నారు. ఎల్‌డిఎం కోటేశ్వరరావు మాట్లాడుతూ స్కీమ్ ముందుకు పోయే విధంగా బ్యాంకర్స్ సహకరాం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో యుసిడి పిఒ కె శకుంతల, ఎస్ డబ్ల్యు, సిఒలు, టిఇఎస్, సిడిఒలు, అధికారులు పాల్గొన్నారు.










