
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం గృహ నిర్మాణ ప్రక్రియలో స్టేజి కన్వర్షన్ ప్రాధాన్యత ఇస్తూ రెండో దశలో చేపట్టిన గృహ నిర్మా ణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్‌లతో ఎమ్‌ఎస్‌ఎంఇ, హౌసింగ్, రెవెన్యూ రీ సర్వే, జాతీయ రహదారులు, వ్యవసాయం, పంచాయతీ రాజ్‌లో ప్రాధాన్యత భవనాలు, ఉపాధిహామీ, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ దృశ్య శ్రవణ సమావేశ మందిరం నుంచి కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జిల్లా ప్రగతిపై మాట్లాడుతూ హౌసింగ్ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు వారం వారం లక్ష్యాలను ఇవ్వడం జరిగిందని, రెండో దశలో 19253 ఇళ్ళకి గాను ఈ వారం 2467 స్టేజ్ కన్వర్టింగ్ లక్ష్యాలను ఇవ్వడం జరిగిందని, 73 ఇళ్ళ నిర్మాణాలు లక్ష్యం కాగా 96 ఇళ్లను పూర్తి చేశారన్నారు. స్టేజ్ కన్వర్షన్ పై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. మూడోవ దశ రీ సర్వే ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయి అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, తొలి రెండు దశల్లో రీ సర్వేలో ఎదుర్కొన్న పలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు జల్ జీవన్ మిషన్ కింద 404 పనులకు రూ.164.34 కోట్లతో 1,63,070 కనెక్షన్స్ ఇచ్చే పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ప్రతి గ్రామంలో నీటి లభ్యత కింద 39 గ్రామాల్లో నూరుశాతం లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. ఉపాధిహామీ పంచాయతీ రాజ్ పనుల్లో భాగంగా 373 గ్రామ సచివాలయ భవనాలకుగాను 286 పూర్తి చేశామని, 347 ఆర్‌బికెలకు గాను 238 భవనాలు, 258 వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్స్‌కు గాను 144 పూర్తి చేసినట్లు తెలిపారు. వ్యవసాయ రంగ సమీక్షలో 3,22,959 ఎకరాలకి గాను 3,15,860 ఈ కేవైసి పూర్తి చేసినట్లు, 97.80 శాతం లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. పిఎం కిసాన్ యోజన కింద అర్హత కలిగిన 97,359 మందికి గాను 96,029 ఈ కేవైసి పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో 100 శాతం ఈ పంట నమోదు చేశామన్నారు. ఉపాధి హామీ పథకం, స్వమిత్వ, రీ సర్వే, తదితర అంశాలపై ప్రధాన కార్యదర్శి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. మల్టీ పర్పస్ ఫెసిలిటీ భవన నిర్మాణాలకు చెంది 53 చోట్ల స్థలాలు గుర్తించడం జరిగిందన్నారు. తదుపరి దశలో ఆయా భవన నిర్మాణాలకు చెందిన కార్యాచరణ ప్రణాళిక లను సిద్దం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ జి. నరసింహులు, ఎస్‌ఈ ఎస్‌బివి ప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ డి.బాల శంకర్ రావు, వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, డ్వామా పిడి పి.జగదాంబ, డిపివో జెవి.సత్యనారాయణ, డిసిఒ వై.ఉమా మహేశ్వర రావు, పశు సంవర్ధక అధికారి డాక్టర్ ఎస్‌జిటి సత్యగోవింద్, హౌసింగ్ పిడి జి.పరశురామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.