* పూర్తయిన ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాలి
* గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ మైదీన్
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: నవరత్నాల్లో భాగంగా జిల్లాకు నిర్దేశించిన గృహ నిర్మాణాల లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని గృహనిర్మాణ సంస్థ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ మైదీన్ అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్‌లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సామూహిక గృహ ప్రవేశాల కోసం 35 వేల నిర్మాణాలను లక్ష్యంగా నిర్ధేశించామని చెప్పారు. ఇప్పటివరకు 30 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. గృహ నిర్మాణాల విషయంలో జిల్లా ప్రగతి బాగుందంటూ కితాబునిచ్చారు. నిర్ధేశించిన లక్ష్యంలో మిగిలిన ఐదు వేల ఇళ్లనూ త్వరితగతిన పూర్తి చేసి సిద్ధం చేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణ బిల్లుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని చెల్లింపులు పూర్తి చేయాలని తెలిపారు. నిర్మాణ బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం గృహ ప్రవేశాల తేదీని ఖరారు చేసే లోగా గృహాలన్నీ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఇసుక, ఇనుము సమస్యలు లేవని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. నిర్మాణాలు పూర్తయిన మేరకు ఎప్పటికప్పుడు లబ్ధిదారుల ఖాతాకు జమ చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి చేసిన పనుల పెండింగ్ బిల్లులు లేకుండా డిజిటల్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ల ద్వారా బిల్లులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆర్‌బికెలు, సచివాలయాలు, వెల్‌నెస్ సెంటర్లను త్వరితగతిన పూర్తి చేయడంపై దృష్టిసారించాలని సూచించారు. అనంతరం రాగోలు లేఅవుట్‌లో చేపడుతున్న గృహాలను పరిశీలించారు. రోడ్డు నిర్మాణాలు, తాగునీటి సౌకర్యం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎన్.గణపతి, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ నాగేశ్వరరావు, అర్బన్ సహాయ ఇంజినీర్ గణేష్, ఉప కార్యనిర్వాహక, కార్యనిర్వాహక ఇంజినీర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఒలు, గ్రామ, వార్డు ఇంజినీర్ సహాయకులు, ఆర్‌డబ్ల్యుఎస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










