ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని రేబాక గ్రామంలో శనివారం జగనన్న లేఅవుట్‌ను హౌసింగ్ డే సందర్భంగా తహసీల్దార్ సుబ్రహ్మణ్యం శాస్త్రి, ఎంపీడీవో సీతారామరాజు, హౌసింగ్ అధికారులు సందర్శించారు. సర్పంచ్ సాదిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభించలేదని అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి, త్వరగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు ఆలస్యమైందన్నారు. జగనన్న లే అవుట్ లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం గొడిచెర్ల, చినదొడ్డిగల్లు సచివాలయాల్లో లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి, ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు వెలగా ఈశ్వరరావు, పంచాయతీ కార్యదర్శిలు కిరణ్, సాయి లక్ష్మి, వైసిపి నాయకులు అల్లు రమణ, కాసుబాబు, తదితరులు పాల్గొన్నారు.
కొటవురట్ల:మండల వ్యాప్తంగా జగనన్న గృహాలు వేగంగా పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి ఉదయశ్రీ సూచించారు. శనివారం శనివారం ఆమె మండల సమావేశం మందిరంలో ఎంపీడీవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పలు గ్రామాల్లో నిర్మాణాలు నత్త నడకన సాగడంపై పలువురు అధికారుల పట్ల అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె పందూరు, రామచంద్రపురం గ్రామాల్లో సందర్శించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్ జగదీశ్వరరావు, పిఆర్ ఇంజనీర్ వర్మ, రామచంద్రపురం వైసిపి నాయకులు వెంకటరమణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.










