Aug 05,2023 23:35

ప్రజాశక్తి-కాకినాడ నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా సామూహిక గృహ ప్రవేశాలకు సంబంధించి ఎంపిక చేసిన లేఔట్‌లలో మిగిలిన పనులన్నీటినీ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌ రెడ్డి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి శనివారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జెసిలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కాకినాడ కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా జాయింట్‌ కలెక్టరు ఎస్‌.ఇలక్కియ, జిల్లాస్థాయి వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టరు కృతికా శుక్లా అధికారులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల గహాలు నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ప్రతి జిల్లాకు ఒక్కో లేఅవుట్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టనున్నదన్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో సామూహిక గహప్రవేశాలకు సంబంధించి ఎంపిక చేసిన లేఔట్‌ లో గృహ నిర్మాణాలు, అంతర్గత రహదారులు, మురికి కాలువలు ఇతర మౌళిక సదుపాయాల కల్పన పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రానున్న ఆగస్టు 20 నాటికి ఈ పనులన్నీ పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్‌పి సిఇఒ ఎ.రమణా రెడ్డి, సిపిఒ పి.త్రినాథ్‌, డిపిఒ ఆర్‌.విక్టర్‌, జిల్లా వ్యవసాయ శాఖ జెడి ఎన్‌.విజరు కుమార్‌, పశుసంవర్తక శాఖ జెడి ఎస్‌.సూర్యప్రకాశరావు, హౌసింగ్‌ పీడీ బి.సుధాకర్‌ పట్నాయక్‌ పాల్గొన్నారు.