
ప్రజాశక్తి-గుంటూరు : ప్రజలు ఆశించినంత స్థాయిలో ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించేలా ఉద్యోగులు బాధ్యతగ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఏపీపీఎస్సీ 2021లో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెవెన్యూ శాఖలో గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికయిన 56 మందికి శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు నియామక ఉత్తర్వులు అందించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారు సర్వీస్ ప్రారంభం నుంచే ప్రజలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను సానుకూల దక్పథంతో పరిశీలించి ప్రభుత్వ సేవలు అందేలా పనిచేయాలన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖతో అధిక శాతం మంది ప్రజలకు నిత్యం పనులు ఉంటాయని సాధ్యమైనంత వరకు మీ పరిధిలో ఉన్న అంశాలను సత్వరమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో పూర్ణ చంద్రరావు, నూతనంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.