ప్రజాశక్తి - సామర్లకోట రూరల్
మొదటి ప్రయత్నంలోనే గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంపిడిఒగా ఎంపికైన సామర్లకోటకు చెందిన తర్లంపూడి చైతన్యను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు అభినందించారు. బుధవారం బలుసులపేటలోని చైతన్య స్వగహంలో జరిగిన అభినందన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చైతన్యకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడారు. తర్లంపూడి కమల్ రాజ్ కుటుంబం తమకు ఎంతో ఆప్తులని, అటు వంటి సామాన్య కుటుంబంలో పుట్టి గ్రూప్‌లో విజయం సాధించడం గర్వకారణమన్నారు. మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. మరో ముఖ్యఅతిథి రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు దవులూరి సుబ్బారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు పెంపకంపైనే పిల్లల భవిష్యత్తు ఉంటుందంన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు-నేడు ద్వారా విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అనంతరం గ్రూప్-1 విజేత చైతన్య మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ఆశీస్సులతోనే ఇంతటి విజయాన్ని సాధించానని తెలిపారు. ప్రజలకు సేవలు అందించే బాధ్యతో ఉంటానన్నారు. తొలుత కుటుంబ సభ్యులతో కలిసి కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజెస్, ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, కమిషనర్ జె.రామరావు, కౌన్సిలర్ ఆవాల లక్ష్మీనారాయణ, నేతల హరిబాబు, వారా పాప, చైతన్య తల్లితండ్రులు కమల్ రాజ్, వైసిపి నాయకుడు గంగిరెడ్డి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.










