* పాత శ్రీకాకుళంలో ఒకే ఇంట్లో ఇద్దరు ఎంపిక
* డిఎస్‌పిగా ఎంపికైన టెక్కలి ఎక్సైజ్ ఎస్‌ఐ ప్రదీప్తి
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, ఆమదాలవలస, పొందూరు: గ్రూప్-1 ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు యువతీ యువతులు విజయకేతనం ఎగురవేశారు. ప్రభుత్వం గురువారం వెలువరించిన ఫలితాల్లో ఉత్తమ మార్కులు పొంది ఉద్యోగాలను ఒడిసిపట్టుకున్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ట్యాక్సెస్, సబ్ ట్రెజరీ అధికారి, డిఎస్‌పి వంటి పోస్టులను సాధించారు. కొందరు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూ గ్రూప్-1కు ఎంపికయ్యారు. మరికొందరు గ్రూప్-1లో ఎంపికై సివిల్స్‌కు సాధన సాగిస్తున్నారు.
ఒకే ఇంట్లో ఇద్దరు ఎంపిక
పాత శ్రీకాకుళంలో నివాసముంటున్న శిష్టకరణం సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలుమహంతి ఉమామహేశ్వరావు ఇద్దరు కుమారులూ గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పెద్ద కుమారుడు పి.వి.ఎస్ రాజేష్ అగ్నిమాపకశాఖ అధికారిగా ఎంపికయ్యారు. చిన్న కుమారుడు మనోజ్ వైద్యారోగ్యశాఖలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఎంపికయ్యారు. రాజేష్ హైదరాబాద్‌లోని గీతమ్‌లో బిటెక్ చదివారు. మనోజ్ బీహార్‌లోని ధన్‌బాద్‌లో ఇండియన్ స్కూల్ మైన్స్‌లో చదివారు. ప్రస్తుతం వీరిద్దరూ ఢిల్లీలోని వజీరామ్ అండ్ రవి కోచింగ్ సెంటర్‌లో సివిల్స్‌కు సాధన సాగిస్తున్నారు. తండ్రి ఉమామహేశ్వరరావు వసతిగృహ సంక్షేమ అధికారిగా ఉద్యోగ విరమణ చేయగా, తల్లి సాయి సుజాత ఆమదాలవలస మండలం తొగరాం జెడ్‌పి హైస్కూల్‌లో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమారులూ గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపిక కావడంపై వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బంధువులు, స్నేహితులు ఫోన్లు చేసి అభినందనలతో ముంచెత్తుతున్నారు.
ఎస్‌టిఒగా రాజశేఖర్
ఆమదాలవలస మండలం తమ్మయ్యపేటకు చెందిన కోట రాజశేఖర్ సబ్ ట్రెజరీ అధికారిగా ఎంపికయ్యారు. మాజీ సర్పంచ్ కోట వెంకట రామారావు, సీతమ్మ ముగ్గురు కుమారుల్లో పెద్ద కుమారుడు రాజశేఖర్. ఒకటి నుంచి పదో తరగతి వరకు శ్రీకాకుళంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో చదివారు. ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోని ఒక ప్రయివేటు కళాశాలో చదివారు. బిటెక్ చెన్నైలో, ఎంటెక్ ఢిల్లీ యూనివర్సిటీలో చేశారు. రాజశేఖర్ గ్రూప్-1కు ఎంపిక కావడంపై గ్రామస్తులు, బంధువులు, పలువురు అభినందనలు తెలియజేశారు.
డిఎస్‌పిగా ప్రదీప్తి
ఆమదాలవలస మండలం కొర్లకోటకు చెందిన పేడాడ ప్రదీప్తి గ్రూప్-1లో డిఎస్‌పిగా ఎంపికయ్యారు. ఈమె తల్లిదండ్రులు పేడాడ అప్పారావు, సుగుణ వేణి ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరి ప్రథమ కుమార్తె పేడాడ ప్రదీప్తి ప్రస్తుతం టెక్కలి డివిజన్‌లో ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈమె ఒకటి నుంచి పదో తరగతి వరకు ఆమదాలవలస పట్టణంలోని విజ్ఞాన్ హైస్కూల్లో విద్యనభ్యసించారు. విశాఖపట్నం శ్రీచైతన్యలో ఇంటర్, గాయత్రి విద్యా పరిషత్‌లో బిటెక్ చదివారు. ఈమె చెల్లి పేడాడ ప్రతిభ ఇండియన్ ఆర్మీ విభాగంలో మేజర్‌గా ఐక్యరాజ్య సమితి తరుపున సూడాన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రదీప్తి గ్రూప్-1లో ర్యాంకు సాధించడంపై గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు పలువురు అభినందనలు తెలిపారు.
ఎసిటిఒగా రాకేష్
పొందూరు మండలం కనిమెట్టకు చెందిన యువకుడు కూన రాకేష్ అసిస్టెంట్ కమిషనర్ ట్యాక్సెస్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీలో బిటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి గ్రూప్-1 పరీక్షలకు ప్రత్యేక శిక్షణను పొందాడు. మొదటి ప్రయత్నంలోనే తన ప్రతిభతో గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తండ్రి కె.వి.వి సత్యనారాయణ పొందూరు మండలం పిల్లలవలసలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తుండగా, తల్లి ధనలక్ష్మి గృహిణి. రాకేష్ గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపిక కావడంపై కుటుంబసభ్యులు, గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










