ప్రజాశక్తి - ఏలూరు
జిల్లాలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఆరు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు సుమారు 69 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్షల తీరును కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వట్లూరు సిఆర్‌ఆర్ ఇంజినీరింగ్, ఏలూరు మోర్ మార్కెట్ రోడ్డులోని నారాయణ బాలుర జూనియర్ కళాశాల, వట్లూరు ఫ్లైఓవర్ సమీపంలోని సిఆర్‌ఆర్ మహిళా కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. జిల్లాలో ఆరు కేంద్రాల్లో 3,106 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఉదయం 2,161 (69.57శాతం) మంది, మధ్యాహ్నం 2,153 (69.32శాతం)మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. ఉదయం 10.00 గంటల నుంచి పేపరు1, మధ్యాహ్నం రెండు గంటల నుంచి పేపరు-2 పరీక్ష జరిగిందన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి సీనియర్ జిల్లా అధికారిని లైజనింగ్ అధికారిగా నియమించామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు అత్యంత ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షల అనంతరం ప్రశ్నాపత్రాలు, ఒఎంఆర్ షీట్లు, ఇతర పరీక్షా సామగ్రిని పూర్తి బందోబస్తుతో స్ట్రాంగ్ రూముకు చేర్చామని, తదుపరి ఎపిపిఎస్‌సి అధికారులు ప్రత్యేక భద్రతతో విజయవాడ తరలిస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట ఆయా పరీక్ష కేంద్రాల లైజనింగ్ ఆధికారులు జిల్లా వ్యవసాయ అధికారి వై.రామకృష్ణ, ఏలూరు ఆర్‌డిఒ పి.పెంచలకిషోర్, డిఆర్‌డిఎ పీడీ ఆర్.విజయరాజు ఉన్నారు.
వట్లూరు సిఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో 1100 మంది ఉదయం పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 779 మంది, మధ్యాహ్నం 775 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
వట్లూరు రైల్వేగేట్ సిఆర్‌ఆర్ పాలిటెక్నికల్ కళాశాల కేంద్రంలో పరీక్షలు రాయాల్సిన 500 మందిలో ఉదయం పరీక్షకు 337 మంది, మధ్యాహ్నం 337 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
సిఆర్‌ఆర్ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రంలో 500 మందిలో ఉదయం 359 మంది, మధ్యాహ్నం 357 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
శ్రీచైతన్య జూనియర్ కళాశాల కేంద్రంలో పరీక్షలు రాయాల్సిన 406 మందిలో ఉదయం పరీక్షకు 303 మంది, మధ్యాహ్నం 302 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఏలూరు నారాయణ బాలుర జూనియర్ కళాశాల కేంద్రంలో ఉదయం పరీక్షకు 200 మంది, మధ్యాహ్నం 200 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
వట్లూరు సిఆర్‌ఆర్ మహిళా జూనియర్ కళాశాల కేంద్రంలో 300 మందిలో ఉదయం పరీక్షకు 183 మంది, మధ్యాహ్నం 182 మంది అభ్యర్థులు హాజరయ్యారు.










